సినీ నటుడు అల్లు అర్జున్ మామపై ఫిర్యాదు.. నానక్ రామ్ గూడలో భూ వివాదం

సినీ నటుడు అల్లు అర్జున్ మామపై ఫిర్యాదు.. నానక్ రామ్ గూడలో భూ వివాదం
  •     గచ్చిబౌలి పోలీసులకు ‘మంత్రి కాస్మోస్’ కంప్లైంట్​
  •     గేట్ల తాళాలు పగలగొట్టి చొరబడ్డారని ఆరోపణ

గచ్చిబౌలి, వెలుగు: నానక్ రామ్​గూడలో భూవివాదం ఘర్షణకు దారితీసింది. ఐటీ కారిడార్ విప్రో చౌరస్తా సమీపంలో ఉన్న ‘మంత్రి కాస్మోస్’ లో భూ ఆక్రమణకు యత్నించారంటూ సినీనటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్​రెడ్డి, అతని అనుచరులపై గచ్చిబౌలి పీఎస్​లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదుదారుల వివరాల ప్రకారం..శేరిలింగంపల్లి మండలం నానక్​రాంగూడ సర్వే నెంబరు 130లో ఉన్న 1.05 హెక్టార్ల భూమిని సెజ్ గా గుర్తించారు. తహసీల్దార్ ధృవీకరణతో ప్రస్తుతం ఉన్న యజమానులకు సదరు స్థలం మ్యాపింగ్ చేసి 2015లోనే అందజేశారు. 

ఈ స్థలంలో ‘మంత్రి కాస్మోస్’ భవనాన్ని నిర్మించి, వివిధ సాఫ్ట్ వేర్ సంస్థలకు లీజుకు ఇచ్చారు.11 ఏండ్లుగా దాదాపు 5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ బిల్డింగులోని ఓనర్లు అసోసియేషన్ ను సైతం ఏర్పాటు చేసుకున్నారు. భవన పర్యవేక్షణ కోసం కస్టమ్స్ శాఖకు చెందిన అధికారి నేతృత్వంలో సెక్యూరిటీని నియమించారు. కాగా, ఈనెల13న ఉదయం 8.40 గంటల సమయంలో మురళీధర్ రెడ్డి, గడ్డం రవి నేతృత్వంలో అనుచరులు అక్రమంగా మంత్రి కాస్మోస్​లోకి ప్రవేశించారు. గేట్ల తాళాలు, ప్రహరీ గోడను కూల్చివేసి, మంత్రి కాస్మోస్ ప్రాంగణాన్ని సగానికి విభజించారు. 

తాము కే. చంద్రశేఖర్​రెడ్డి ఆదేశాల మేరకు పనులు చేపడుతున్నామంటూ సెక్యూరిటీపై దాడి చేసి, కొంతమేర రేకుల ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న భవన మేనేజర్ రావి పెద్దిరాజు స్పాట్​కు చేరుకొని వీరి ప్రయత్నాలను అడ్డుకున్నారు. వెంటనే సదరు స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో వారు వెనుదిరిగారు. కాగా ఉద్దేశపూర్వకంగానే చంద్రశేఖర్​రెడ్డి ఆదేశాల మేరకు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిలతో పాటు వారి అనుచరులు ఆక్రమణకు ప్రయత్నించారంటూ మంత్రి కాస్మోస్ మేనేజర్ రావిపెద్ది రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 329(3), 324(4), 351(2) రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనా స్థలిలో లేకపోవడంతో అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డిపై  కేసు ఫైల్​ చేయలేదని పోలీసులు తెలిపారు.