దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దేశ నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర కీలకం :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మోక్షగుండం విశ్వేశ్వరయ్య అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం, దూరదృష్టి నేటి ఇంజనీర్లకు  స్ఫూర్తిదాయకమని ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. నేషనల్ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్ర సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆ శాఖ ఈఎన్‌‌‌‌‌‌‌‌సీ లింగారెడ్డి, పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడారు. దేశ అభివృద్ధికి ఇంజనీర్లు వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా సంక్షేమంతో మేళవించి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ఇంజనీర్ల ముందున్న ప్రధాన బాధ్యత అని మంత్రి తెలిపారు. నాణ్యమైన రోడ్లు,  ఆధునిక భవనాలు, మెరుగైన మౌలిక సదుపాయాల ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఇంజనీర్లు అంకితభావంతో పనిచేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. 

మంత్రిని కలిసిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో మంగళవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీ, తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధివకారి జె. శ్రవణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ తమిళనాడు ప్రభుత్వంలో గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు పలు కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు.