గణేష్ నిమజ్జనం పూలు రీసైక్లింగ్.. అగర్బత్తీలు, ప్రమిదల తయారీ! చెరువుల దగ్గర ప్రత్యేక కౌంటర్లు

గణేష్ నిమజ్జనం పూలు రీసైక్లింగ్.. అగర్బత్తీలు, ప్రమిదల తయారీ! చెరువుల దగ్గర ప్రత్యేక కౌంటర్లు
  • వాడిన పూలే వికసించులే...
  • నిమజ్జనాల్లో పూలను రీసైక్లింగ్ చేయనున్న సీఎంసీ 
  • అగర్​బత్తీలు, ధూపాలు, ప్రమిదలు తయారు చేస్తరు  
  • చెరువుల వద్ద ప్రత్యేక కేంద్రాలు  

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్​నిమజ్జనం సందర్భంగా భక్తులు సమర్పించే పూలను రీసైకిల్​చేసి తిరిగి వినియోగించుకునేలా సీఎంసీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పక్కా ఆర్గానిక్స్ సంస్థ ప్రతినిధులతో సీఎంసీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఘాట్ల వద్ద పూల వ్యర్థాలను నీటిలో కలపకుండా వేరుగా సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నది. 

తొలిదశలో కూకట్‌‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద ప్రత్యేక పూల సేకరణ కియోస్క్‌‌లను అందుబాటులోకి తీసుకురానున్నది. భక్తులు సమర్పించిన పూలను సేకరించి, వేరు చేసి ఎండబెట్టి వాటిని శుద్ధి చేసి అగర్​బత్తీలు, ధూపాలు, ప్రమిదలుగా ప్రాసెస్ చేసి రీసైక్లింగ్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌‌లు, రీసైక్లింగ్ టెక్నాలజీ కలిగిన సంస్థలు ముందుకు రావాలని సీఎంసీ కోరింది.