హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాలను పసుపు నీటితో శుద్ధి చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నిందితులకు చట్టప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని, వారిని నేరుగా అరెస్టు చేయవద్దని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫామ్ హౌస్ వద్ద నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ద్వారా దళితులను అవమానించారనే ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు.దీనిపై బీఆర్‌ఎస్ లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేసింది. వీటిని జస్టిస్ టి. మాధవీదేవి మంగళవారం విచారణ చేపట్టారు. దర్యాప్తు సందర్భంగా చట్ట నిబంధనలు పాటించాలని పోలీసులను ఆదేశించారు.
