హైదరాబాద్సిటీ, వెలుగు: రానున్న రోజుల్లో ప్రైవేట్ట్రావెల్స్బస్సులను సిటీ శివార్లలోనే ఆపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం, రాత్రి వేళ రోడ్లపైకి పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులను సిటీకి నలువైపులా కొత్తగా నిర్మించనున్న ఆధునిక బస్ టెర్మినల్స్ ద్వారా నిర్వహించే విధానంపై ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ టెర్మినల్స్ వినియోగించుకునే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆ పద్ధతి పాటించకుండా రోడ్లపైనే ఆపుతామంటే కఠిన చర్యలు తప్పవన్నారు. శివారు ప్రాంతాల్లో నిర్మించనున్న బస్ టెర్మినల్స్ ఏర్పాటుకు అవసరమైన భూమి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. గాజులరామారంలో 100 ఎకరాలు, శంషాబాద్ వైపు 150 ఎకరాల భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు.
