ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో నిందితుడికి 7 రోజుల పోలీస్ కస్టడీ.. ఉగ్రలింకులపై అనుమానాలు

 ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో నిందితుడికి 7 రోజుల పోలీస్ కస్టడీ.. ఉగ్రలింకులపై అనుమానాలు

 బొల్లారం ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో  నిందితుడికి 7 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. దీంతో నిందితుడు మల్లేష్ ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు పోలీసులు.  చోరీ చేసిన ఆయుధాలు ఎక్కడికి తరలించాడనే దానిపై ఆరా తీస్తున్నారు. 

చోరీ వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ చేయనున్నారు పోలీసులు. ఆయుధాల చోరీకి అసలు కారణమేంటి? ఎవెవరికి ఆయుధాలు పంపాలని అనుకున్నారు అనే కోణంలో  నిందితుడిని ప్రశ్నించనున్నారు. 

ఆయుధాల చోరీ కేసులో రెజిమెంట్లో పనిచేసి ఇటీవల డిస్మిస్ అయిన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఉప్పుతొల్ల మల్లేశ్(37)ను శుక్రవారం (2026 సెప్టెంబర్ 11) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అపహరించిన నాలుగు ఏకే 203 ఆయుధాలు సహా ఇన్సాస్ (ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్), పిస్టల్స్, బుల్లెట్లు, బైనాక్యులర్ను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ కేసులో నిందితుడికి కస్టడీ విధించడంతో మరిన్ని వివరాలు సేకరించనున్నారు పోలీసులు. అటు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా లేక ఈశాన్య రాష్ట్రాల నుంచి ఉగ్ర లింకులు ఉన్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ జరపనున్నారు.