కేంద్రానికి తలవంచిన మెటా.. ఇకపై బాలల వేధింపుల కేసులు నేరుగా భారత్‎కే రిపోర్ట్

కేంద్రానికి తలవంచిన మెటా.. ఇకపై బాలల వేధింపుల కేసులు నేరుగా భారత్‎కే రిపోర్ట్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి అమెరికా టెక్ దిగ్గజం మెటా తలొగ్గింది. తమ నేతృత్వంలోని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్‎లలో బాలలపై లైంగిక వేధింపుల కేసులు, ఇతర బాలల భద్రతా సంబంధిత విషయాలను నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు నివేదించడానికి మెటా అంగీకరించింది. ఇప్పటివరకు బాలల లైంగిక వేధింపుల సమాచారాన్ని అమెరికాకు చెందిన ఏజెన్సీలకు మాత్రమే మెటా నివేదించేది. తాజా అంగీకారంతో ఇకపై ఈ కేసులను నేరుగా భారత దర్యాప్తు సంస్థలకే మెటా అందజేస్తుంది. ఆన్‌లైన్‌లో హానికరమైన, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కంటెంట్‌‎పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోన్న నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది.

పిల్లల భద్రతపై నో కాంప్రమైజ్: కేంద్రం

భారత్‏లో పనిచేస్తున్న సోషల్ మీడియా కంపెనీలకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై పిల్లల భద్రత ఒక కీలకమైన ఆవశ్యకత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని తేల్చిచెప్పింది. పిల్లల భద్రతకు సంబంధించిన విషయాలను నేరుగా సంబంధిత భారతీయ చట్ట అమలు సంస్థలకు నివేదించడానికి మెటా అంగీకరించడం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను పిల్లలకు సురక్షితంగా మార్చే దిశగా ఇది మొదటి అడుగని పేర్కొంది.

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను మరింత సురక్షితంగా మార్చడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పిల్లల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే లేదా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

అసలు ఏం జరిగిందంటే..?

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లో బాలల లైంగిక వేధింపులు, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కంటెంట్‎కు సంబంధించిన చెల్లింపు ప్రకటనలు, కంటెంట్ కలకలం రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెటా సంస్థకు నోటీసులు జారీ చేసి వివరణ కోరాయి. భారత్ లో కార్యకలాపాలు కొనసాగించాలంటే ఇక్కడి చట్టాలకు లోబడి పని చేయాల్సిందేనని తేల్చిచెప్పాయి. 

కొత్త ఐటీ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్‎లకు సమాచార సాంకేతిక చట్టం కింద లభించే సేఫ్ హార్బర్ రక్షణ కోల్పోవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కంటెంట్ కు సంబంధించిన సమాచారాన్ని నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు మెటా అంగీకరించింది.