UPI యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. రూ.2 వేల వరకు లావాదేవీలు ఫ్రీ

UPI యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. రూ.2 వేల వరకు లావాదేవీలు ఫ్రీ

న్యూఢిల్లీ: వినాయక చవితి వేళ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 2 వేల వరకు జరిపే UPI లావాదేవీలపై బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించరాదని ఆదేశించింది. రూపే డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు చేసే చెల్లింపులపైనా ఛార్జీలు విధించడాన్ని నిషేధించింది. ఈ మేరకు 2026, సెప్టెంబర్ 14 అర్థరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏ కింద ఈ మార్పులను నోటిఫై చేసినట్లు గెజిట్‎లో పేర్కొంది.

కేంద్రం విడుదల చేసిన కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. రూ.2 వేల వరకు చేసే యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు గానీ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. డబ్బులు పంపే, స్వీకరించే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. చిన్న వ్యాపారులు, దుకాణాదారులకు ఈ నిర్ణయం ఉపశమనం కల్గించనుంది.

యూపీఐ ద్వారా రూ.2 వేలు లేదా అంతకన్నా ఎక్కువ చెల్లింపులపైన ప్రస్తుతం కూడా ఎలాంటి చార్జీలు లేవు. అయితే, యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల విధింపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. దీంతో యూపీఐ లావాదేవీలపై సర్వీస్ చార్జీలు వసూల్ చేసే అవకాశం ఉందని వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో వ్యక్తిగత (పీ2పీ) యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లేటేస్ట్‎గా దీనిపై అధికారిక గెజిట్ విడుదల చేసింది. 

భవిష్యత్తులో వ్యాపారులపై ఎండీఆర్ విధించినా అది కూడా భారీ లావాదేవీలకు మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కొంత మేర ఆదాయం సమకూరి, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసుకోవడం కోసమే వ్యాపారులపై ఎండీఆర్ విధింపునకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది. ఎండీఆర్ ఛార్జీలు కూడా భారీగా ఏమి ఉండవని.. నామమాత్రంగానే ఉంటాయని స్పష్టం చేసింది.