ఖైరతాబాద్కు పొటెత్తిన భక్తులు.. ఉదయం నుంచే మహాగణపతి దర్శనానికి క్యూలైన్లు

ఖైరతాబాద్కు పొటెత్తిన భక్తులు.. ఉదయం నుంచే మహాగణపతి దర్శనానికి క్యూలైన్లు

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తుల తాకిడి మొదలైంది. మొదటి రోజు తొలి హారతి, తొలి పూజలందుకున్న గణనాథుడిని వేల మంది దర్శించుకున్నారు. రెండో రోజు మంగళవారం (2026 సెప్టెంబర్ 15) కూడా భక్తుల తాకిడి కొనసాగుతోంది. ఉదయం నుంచే మహాగణపతి దర్శనానికి భక్తులు బారులు తీరారు. 
 
పొద్దు పొద్దున ప్రశాంతమైన మనసుతో గణనాథుడిని పూజించి, ఆశీర్వాదాలు అందుకునేందుకు సిటీ నలు మూలల నుంచి వస్తున్నారు భక్తులు. సాయంత్రం  సిటీలో ట్రాఫిక్, ఖైరతాబాద్ గణేష్ దగ్గర రష్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో.. ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని ఉదయం నుంచే దర్శనానికి వస్తున్నారు.

ఇప్పటికే ఖైరతాబాద్ రూట్ లోట్రాఫిక్‌ ఆంక్షలు  కొనసాగుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఉదయం నుంచే ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. దర్శనానికి వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 

తొలిరోజు లక్ష మందికి దర్శనం: 

రెండో రోజు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద పూజలు కొనసాగుతున్నాయి.  నిన్న వినాయక చవితి , మొదటి రోజు వేడుకలకు భక్తుల రద్దీ కొనసాగింది.  మొదటి రోజు దాదాపు లక్ష మంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా వేస్తున్నారు. 

ఈ సారి 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేషుడి దర్శనం ఇస్తున్నారు. బడా గణేష్ తో పాటు కాళీకమాత, సోమనాథ్ జ్యోతిలింగం, విశ్వ కర్మ, విష్ణుమూర్తి విగ్రహాలు ప్రతిష్టించారు. వేడుకలకు ప్రభుత్వం తరపున పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.  

రెండో రోజు  దాదాపు 50 వేల నుండి 80 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉదని భావిస్తున్నారు.   మహా గణపతి దగ్గర రెండో రోజు ముఖ్య పూజ కార్యక్రమాలు, మహా హారతి కొనసాగుతున్నాయి. భక్తుల కోలాహలం కొనసాగుతోంది. 

పోలీసుల బందోబస్తు.. షీ టీమ్స్ తో నిఘా:

బడాగణేష్ దర్శనానికి తొలి రోజు నుంచి నిరంతరం భక్తులు రానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.  భక్తుల భద్రత, తోపులాటలు జరగకుండా నివారించేందుకు పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఉత్సవాలు ముగిసే వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత పటిష్టమైన బందోబస్తు అమల్లో ఉంటుందని ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ సిబ్బందిని రంగంలోకి దించినట్లు వివరించారు. ఈవ్‌టీజర్లు, జేబుదొంగలపై నిరంతర నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు విధుల్లో ఉన్నాయి.

 నిమజ్జనం వరకు భద్రత:

ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణమంతటా భారీ సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుంచి అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. తొమ్మిది రోజుల పూజా కార్యక్రమాలతో పాటు చివరి రోజు జరిగే మహా నిమజ్జనం పూర్తయ్యేంత వరకు భత్రత కొనసాగుతుందని  డీసీపీ స్పష్టం చేశారు. పోలీసుల పక్కా ప్రణాళికతో  భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు.