గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పల్లెల్లో... పట్టణాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వినాయకుడిని బాధ్రపద శుద్ద చవితి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు పూజించి.. అనంత చతుర్దశి రోజున( 2026 సెప్టెంబర్ 25) నిమజ్జనం చేస్తారు. అయితే తొమ్మిదిరోజులు వినాయకుడి ఎలా పూజించాలి.గణపతి నవరాత్రుల్లో ఏ రోజు ఏ అవాతర వినాయకుడిని ఆవాహన చేయాలి... దాని విశిష్టత ఏంటి.. ఏ పదార్దం నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. . . .
1వ రోజు .. సెప్టెంబర్ 14 .. ( భాద్రపద శుద్ధ చవితి) .. వరసిద్ది వినాయకుడి ఆవాహన చేసి పూజించి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించావ. ఇంటింటా వినాయక పూజ చేసుకున్నాం వ్రతకల్పంలో భాగంగా పూజ పూర్తయ్యాక శమంతక ఉపాఖ్యానం విన్నాం. చవితినాటి చంద్రుణ్ని చూసినవారికి నీలాపనిందలు కలుగుతాయన్న శాపం నుంచి బయటపడటం కోసం ఈ కథ చదువుకుని అక్షతలు తలమీద వేసుకున్నాం కూడా . అక్షతలను మనమే ధరించాలి తప్ప, భగవంతుడిపై వేయకూడదు. ఒక్కరోజు కార్యక్రమం నిర్వహించుకునే వారికి ఈ కథ చాలు. నవరాత్రులు జరిపేవారు మాత్రం ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని ఆవాహన చేసి పూజించాలి.
2వ రోజు .. సెప్టెంబర్ 15 ..(భాద్రపద శుద్ధ పంచమి).. వికట వినాయకుడిని పూజించాలి. లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి.రెండోనాటి పూజ ద్వారా సమాజం దుష్ట కామాన్ని వీడాలి.
3వ రోజు.. సెప్టెంబర్ 16 .. (భాద్రపద శుద్ధ షష్ఠి)... లంబోదర వినాయకుడిని పూజించి పేలాలను నైవేద్యంగా సమర్పించాలి. క్రోధాసురుణ్ని వధించిన లంబోదరుడిని మూడోనాడు షోడశోపచారాలతోనూ, అష్టోత్తర శతనామావళితో గానీ, సహస్ర నామావళితోనూ పూజించాలి. మూడవరోజుపూజతో భక్తులు క్రోధాన్ని విడిచిపెట్టడం కర్తవ్యం.
4వ రోజు.. సెప్టెంబర్ 17 .. (భాద్రపద శుద్ధ సప్తమి) .. నవరాత్రుల నాలుగోరోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి. లోభాంతకుడయిన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి. విశ్వబ్రహ్మ కుమారుడైన కుబేరుడు తన మారుసోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరమవుతాడు. . నాలుగోరోజున గజానన వినాయకుడి పూజ పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే.
5వ రోజు.. సెప్టెంబర్ 18 .. ( భాద్రపద శుద్ధ అష్టమి).. మహోదర వినాయకుడిని గణపతి నవరాత్రిళ్లలో ఐదవరోజున పూజించి నివేదనగా కొబ్బరి కురిడిని సమర్పించాలి. శుక్రాచార్యునికి మోహాసురుడనే ప్రియశిష్యుడు ఉండేవాడు. గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలిపి, మహాశక్తిమంతుడిని చేశాడు. అయిదోనాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులం కావడమే.
6వ రోజు.. సెప్టెంబర్ 19 .. (భాద్రపద శుద్ధ నవమి) ... ఏకదంత వినాయకుడిని ఆరవరోజు పూజించి నువ్వులు/ నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. దేవతలు, రుషులకు అభయమిచ్చి ఏకదంతుడు సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు. మదాసురునితో పోరుకు నిలిచాడు. సింహం ఆ అసురునిపై లంఘించి, వాడి గొంతును నోట కరుచుకుంటుంది. ఏకదంతుడు తన పాదాన్ని అసురుడి గుండెపై మోపాడు. ఆ పాదస్పర్శతో మదాసురుడి మదం అణగి ఏకదంత గణపతిని శరణువేడాడు. గణపతి వాడికి అభయమిచ్చి, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించవద్దని బుద్ధిచెప్పి, పాతాళానికి పంపుతాడు. ఆరోరోజుపూజకు పరిపూర్ణత మనలోని మదాన్ని విడిచిపెట్టడమే.
7వ రోజు .. సెప్టెంబర్ 20 ..( భాద్రపద శుద్ధ దశమి) ...వక్రతుండ వినాయకుడిని ఏడవరోజు పూజించి అరటి పండ్లతో పాటు ఇతర రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. మూషికాసురుడు మత్సరాసురుడిని గణపతిపై పోరుకు ప్రోత్సహిస్తాడు. వక్రతుండ గణపతి కనికరించి, ఆ మత్సర సింహాన్ని నేలకు జార్చి దానిని వాహనంగా చేసుకున్నాడు. ఏడవరోజు పూజకు పరిపూర్ణత మాత్సర్య గుణాన్ని వీడటమే.
8వ రోజు .. సెప్టెంబర్ 21 .. (భాద్రపద శుద్ధ ఏకాదశి) ... విఘ్నరాజ వినాయకుడిని ఎనిమిదవరోజు పూజించి సత్తుపిండిని నైవేద్యం పెట్టాలి. విఘ్నరాజ గణపతిగా సాక్షాత్కరించిన వినాయకుడు తన వక్రతుండాన్ని బాగా పెంచి, ముల్లోకాలలో వ్యాపించిన మమతాసురుడి విష వాయువులను పీల్చేశాడు. విఘ్నరాజ గణపతి ఉచ్ఛ్వాసల ప్రభావానికి మమతాసుర సర్పంకూడా తొండంలో చొరబడింది. మమతను వీడి ధర్మబద్ధంగా ఉండటమే ఎనిమిదవరోజు పూజ అంతరార్థం.
9వ రోజు .. సెప్టెంబర్ 22(భాద్రపద శుద్ధ ద్వాదశి) .. ధూమ్రవర్ణ వినాయకుడిని చివరి రోజు తొమ్మిదవ రోజు ఆవాహన చేసి అర్చించి.. నేతి అప్పాలను నివేదనగా సమర్పించాలి. . ధూమ్రవర్ణ గణేశుడు తన చేతిలోని పాశాన్ని అహంకారునిపై ప్రయోగిస్తాడు. దానితో ఆ రాక్షసుడి శక్తి నశించి, స్వామి శరణాగతుడయ్యాడు. గణేశుని అర్చించే వారి జోలికి రానని చెప్పి, ధూమ్రవర్ణ వినాయకుడి ఆదేశంతో పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. ఈ తొమ్మిదోనాటి పూజకు పరిపూర్ణత అహంకారాన్ని విడిచిపెట్టడమేని పండితులు చెబుతున్నారు.
