గణేష్ పండుగ సందర్భంగా కామారెడ్డి పోలీసులు వినూత్నంగా ట్రాఫిక్ పోలీస్ వినాయకుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు. రైల్వే స్టేషన్ ముందు ఏర్పాటు చేసిన ఈ విగ్రహం పట్టణవాసులను ఆకట్టుకుంటోంది. ట్రాఫిక్ థీమ్ లో ప్రతిష్టించిన గనణాథుని విగ్రహం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆలోచన మేరకు టౌన్ పోలీసులు ట్రాఫిక్ పోలీస్ లుక్‌లో వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం దగ్గర ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి రోడ్డు భద్రతా సందేశాలను ప్రచారం చేస్తున్నారు.
ఫ్లెక్సీలపై ఇలా రాశారు:
- వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించు భక్తా
- ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించు భక్తా
- డ్రైవింగ్లో మొబైల్ వాడకు భక్తా
- డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకు భక్తా
- సీటు బెల్టు తప్పనిసరిగా ధరించు భక్తా
- నీకోసం నీ కుటుంబం ఎదురుచూస్తోంది.. క్షేమంగా ఇంటికి చేరుకో.. ప్రతి సంవత్సరం నా దర్శనానికి రా భక్తా
పండుగ సందర్భంగా భక్తి భావంతో పాటు రోడ్డు నియమాలు పాటించాలని పోలీసులు ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా కామారెడ్డి పోలీసులు ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు అభినందిస్తున్నారు.
