కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేల వర్గం మరో బిగ్ షాక్ ఇచ్చింది. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెజినగర్ అభ్యర్థిగా సఫియుజ్జమాన్ షేక్, నందిగ్రామ్ క్యాండిడేట్‌గా మహమ్మద్ ఎతేశాముల్ హక్‌ను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మమతా టీఎంసీ నందిగ్రామ్‌కు సంచితా ప్రధాన్ డేను, రేజినగర్‌కు రబియుల్ ఆలం చౌదరిని అభ్యర్థులుగా ప్రకటించింది.
తొలుత ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించిన టీఎం రెబల్ వర్గం ఆ తర్వాత మనసు మార్చుకుని పోటీకి సిద్ధమైంది. కాంగ్రెస్, సీపీఐ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అధికార బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. టీఎంసీ రెబల్ వర్గం ఉప ఎన్నికల బరిలోకి దిగనుండటంతో ఈ బై ఎలక్షన్స్ పోరు మరింత రసవత్తరంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉప ఎన్నిక ఎందుకంటే..?
వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి రాజీనామాతో నందిగ్రామ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2026 బెంగాల్ ఎన్నికల్లో సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీని చిత్తుచేసిన భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ నందిగ్రామ్‌కు అసెంబ్లీకి రాజీనామా చేశారు. దీంతో నందిగ్రామ్‌కు ఉప ఎన్నిక వచ్చింది.
ఇక, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్ రాజీనామాతో రెజినగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కబీర్ తన సొంత స్థానమైన నవదా నియోజకవర్గంతో పాటు రేజినగర్ నుంచి బరిలోకి దిగి రెండు చోట్ల గెలుపొందారు. దీంతో ఆయన రేజినగర్ సెగ్మెంట్ కు రిజైన్ చేసి నవదా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో జరుగుతోన్న తొలి ఎన్నికలు ఇవే కానుండటంతో ఈ బైఎలక్షన్స్పై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
