చిన్న బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సినిమాకు బాటలు వేసింది. ఆ చిత్ర దర్శకుడు విశాల్ చతుర్వేది తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. భారతీయ భక్తి, ఆధ్యాత్మికత, సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి గోస్వామి తులసీదాస్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ సినిమాకు ‘రాంబోలా’ (RamBola) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
‘హనుమాన్ అంశ్’ తర్వాత మరో మహనీయుడి కథ..
విశాల్ చతుర్వేది తెరకెక్కించిన ‘హనుమాన్ అశ్’ ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చింది. శ్రీ నీమ్ కరోలి బాబా ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదట్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. రెండో వారం నుంచి ఊహించని రీతిలో పుంజుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు పలు ట్రేడ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.268 కోట్ల మార్క్‌ను దాటినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు నివేదికలు తెలిపాయి. అంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా 134 రెట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ సక్సెస్ జోష్‌లోనే విశాల్ తన తదుపరి సినిమాను ప్రకటించడం విశేషం.
తులసీదాస్ జీవితంపై ‘రాంబోలా’
‘రాంబోలా’ సినిమా మహాకవి, భక్తకవి గోస్వామి తులసీదాస్ జీవితం, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం, భక్తి, సాహిత్య సేవ, ఆయన వదిలి వెళ్లిన చిరస్థాయి వారసత్వం చుట్టూ సాగనుంది. తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచనల్లో ఒకటి. ఆయన పేరుతో ప్రసిద్ధి చెందిన ‘హనుమాన్ చాలీసా’ కూడా భక్తుల్లో విశేష ఆదరణ పొందింది.
తులసీదాస్ జీవితంలోని సాధారణంగా పెద్దగా తెలియని అంశాలను కూడా సినిమాలో చూపించే అవకాశం ఉందని తాజా కథనాలు సూచిస్తున్నాయి. అయితే కథలో ఏ అంశాలను ప్రధానంగా చూపించబోతున్నారు? తులసీదాస్ పాత్రలో ఎవరు కనిపించనున్నారు? వంటి వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు.
దర్శకత్వంతో పాటు నిర్మాణ బాధ్యతలు కూడా..
‘రాంబోలా’కు విశాల్ చతుర్వేది కథ రాసి, దర్శకత్వం వహించనున్నారు. అలాగే ఆయన నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. మహావీర్ జైన్, విశాల్ చతుర్వేది, అమిత్ ఉపాధ్యాయ్, రఘువేంద్ర సింగ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహావీర్ జైన్ ఫిల్మ్స్ ఈ సినిమాను సమర్పిస్తోంది.
గణేశ్ చతుర్థి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తూ.. “బప్పా ఆశీస్సులతో.. వినయం, కృతజ్ఞతలతో గోస్వామి తులసీదాస్ అమర కథ ‘రాంబోలా’ను తీసుకొస్తున్నాం” అంటూ మేకర్స్ ప్రకటించారు.
భక్తి కథలపై దర్శకుడి ఫోకస్..
‘హనుమాన్ అశ్’లో నీమ్ కరోలి బాబా జీవితాన్ని చెప్పిన విశాల్ చతుర్వేది.. ఇప్పుడు తులసీదాస్ కథను ఎంచుకోవడం ఆసక్తిని పెంచుతోంది. అంటే వరుసగా భారతీయ సంత్ పరంపర, భక్తి, ఆధ్యాత్మికతకు సంబంధించిన కథలను ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. ‘హనుమాన్ అశ్’ అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో ‘రాంబోలా’పై సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం ‘రాంబోలా’ విడుదల తేదీ, నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించలేదు. అయితే తులసీదాస్ వంటి మహనీయుడి జీవితాన్ని తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రకటన మాత్రం ఇప్పుడే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సెప్టెంబర్ 18న తెలుగులోకి..
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి, రికార్డ్ స్థాయి వసూళ్లు అందుకుంటున్న ‘హనుమాన్ అంశ్’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్. ఆయన సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 18న తెలుగులో థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు డా. విశాల్ చతుర్వేది ఈ సినిమాను రూపొందించారు. రాగిని ఎస్, నమ్రత. జి. సింగ్, అనుప్రియ ఎ నగర్, డా.విశాల్ చతుర్వేది నిర్మించారు. శోభిత్ శ్రీవాత్సవ, చందన్ ఆనంద్, పూర్ణిమ తివారి, విహాన్ షెగ్డే కీలక పాత్రల్లో నటించారు.
