- త్వరలో ప్రారంభిస్తామని అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి శ్రీధర్ బాబు
- ఒప్పందాలు కుదుర్చుకుంటున్న అధికారులు.. కంపెనీలను ఆకర్షించేందుకు సబ్సిడీలు
- రూ.54 కోట్లతో నిర్మాణం, అన్ని వసతులతో సిద్ధమైన ఐటీ టవర్
ఆదిలాబాద్, వెలుగు: అడవుల జిల్లా ఆదిలాబాద్ ఐటీ శోభను సంతరించుకుంది. జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్ ను మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో వెల్లడించారు. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్ ప్రారంభించాలని, ఐటీ పరిశ్రమలను తీసుకురావడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గత శుక్రవారం అసెంబ్లీలో లేవనెత్తగామంత్రి స్పందించారు. హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు దూరంగా ఉన్న ఆదిలాబాద్ వంటి రిమోట్ ప్రాంతాలకు ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఇన్సెంటివ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఐటీ టవర్ ప్రారంభించనున్నామని, రెండు కంపెనీలు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ఐటీ టవర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల నుంచి బీపీవో, ఐటీ అనెబుల్డ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగాలకు చెందిన మరిన్ని మధ్యస్థాయి కంపెనీలను ఇక్కడికి ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడేళ్ల పాటు కార్యకలాపాలు అందించే కంపెనీలకు అద్దెలో రాయితీ కల్పించనుంది.
రూ.54 కోట్లతో నిర్మాణం
జిల్లా కేంద్రంలోని న్యూ హౌజింగ్ బోర్డుకు ఆనుకొని ఉన్న జాతీయ రహదారి 44 పక్కన 3 ఎకరాల స్థలంలో 2023లో ఐటీ టవర్ నిర్మాణం ప్రారంభమైంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నోడల్ ఏజెన్సీగా ప్రాజెక్ట్ చేపట్టింది. 65వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీప్లస్ 4 అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారు. మొదట్లో రూ.43 కోట్లు మంజూరైనప్పటికీ మధ్యలో నిధుల కొరతతో పనులు ఆలస్యమయ్యాయి. చివరకు బడ్జెట్ ను రూ.54 కోట్లకు పెంచి తాజాగా ఐటీ టవర్ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో ఆధునిక వర్క్ స్టేషన్లను సిద్ధం చేశారు. ఒక్కో షిఫ్ట్‌కు 660 మంది పనిచేసేలా సిద్ధం చేశారు. మూడు షిఫ్టుల్లో దాదాపు 2 వేల మంది యువతకు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. అన్ని వసతులతో ఐటీ టవర్ సిద్ధమైంది.
స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు
రాష్ట్రంలో హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్‌గా ఉంది. ఇది కాకుండా ఐటీ ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, పుణే వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ సేవలను రాష్ట్రంలోని టైర్ 2, టైర్ 3 నగరాలు, పట్టణాలకు విస్తరించేందుకు ఐటీ టవర్లు, ఐటీ హబ్‌లను జిల్లాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, సిద్ధపేట, నల్గొండ పట్టణాల్లో ఇప్పటికే ఐటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టైర్ 3 లోకి వచ్చే ఆదిలాబాద్ లో మొదటి సారిగా ఐటీ టవర్ ఏర్పాటైంది. ఇప్పటికే రెండు కంపెనీలు 450 సీట్లు బుక్ చేసుకొని ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో తమకు స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు వస్తాయని స్థానిక యువత ఆశతో ఎదురుచూస్తున్నారు.
