- ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సర్కారు పెద్దపీట
- గురుకులాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్లు
- విద్య కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకం తొలి విడత ఆర్థిక సాయాన్ని నవంబర్ నుంచి అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో రూ.లక్షలోపు సాయం కోరిన వారికి తొలి విడతలోనే యూనిట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను కార్యాలయాల్లోనే స్వీకరించాలని, ఎంపిక ప్రక్రియను కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.
మంగళవారం ప్రజాభవన్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు, గురుకులాల నిర్వహణ, విద్యా మౌలిక వసతులు, స్వయం ఉపాధి, స్కాలర్‌షిప్‌లు, స్టడీ సర్కిళ్లపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని భట్టి చెప్పారు. విద్యారంగ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేయడానికి వెనుకాడబోమన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో పేదలు, బహుజన వర్గాల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పదేండ్లలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యువశక్తిని నిర్వీర్యం చేసిందని భట్టి విమర్శించారు.
గురుకులాల్లో కేంద్రీకృత యంత్రాల వంటశాలలు..
రాష్ట్రంలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు శుభ్రమైన, నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు సెంట్రలైజ్డ్ మెకనైజ్డ్ కిచెన్లు ఏర్పాటు చేయాలని భట్టి ఆదేశించారు. ఇందుకు బడ్జెట్‌లో ఇప్పటికే రూ.25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కిచెన్ల నిర్మాణం, యంత్రాల కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు . మరో 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెకనైజ్డ్ కిచెన్లు ఎలా ఏర్పాటు చేస్తారనే దానిపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో రావాలని సూచించారు. కిచెన్ల నిర్మాణం పూర్తయ్యే వరకు విద్యార్థుల భోజనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలన్నారు. అప్పటివరకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకం కోసం ఉపయోగిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ల నమూనాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
పూర్వ విద్యార్థులపై అధ్యయనం
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్, సంక్షేమ విద్యాసంస్థల్లో గత పదేండ్లలో చదువు పూర్తి చేసిన విద్యార్థుల సమగ్ర డేటాబేస్ తయారు చేయాలని భట్టి ఆదేశించారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలన్నారు. చదువు పూర్తయ్యాక ఎంతమంది ఉన్నత చదువుల్లో స్థిరపడ్డారు? ఎంతమంది మంచి ఉద్యోగాలు సాధించారు? ఆర్థిక, సామాజిక కారణాలతో ఎంతమంది మధ్యలోనే చదువు మానేశారు? అనే వివరాలను సేకరించాలని సూచించారు. ఈ విద్యాసంస్థలు అందించిన విద్య, వసతులతో విద్యార్థుల జీవితాల్లో వచ్చిన మార్పులపై సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)తో అధ్యయనం చేయించి డిటైల్డ్ రిపోర్టు తయారు చేయాలని చెప్పారు.
స్టడీ సర్కిళ్లపై నివేదిక ఇవ్వాలి..
ఎస్సీ స్టడీ సర్కిళ్లకు ఇప్పటివరకు చేసిన ఖర్చు, ఎంపికైన అభ్యర్థుల సంఖ్య, వారికి ఇచ్చిన శిక్షణ, సాధించిన ఫలితాలపై భట్టి ఆరా తీశారు. పెట్టుబడికి తగ్గ ఫలితాలు వస్తున్నాయా? అనే దానిపై సమగ్ర అంచనా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్టడీ సర్కిళ్లలో అత్యుత్తమ ఫలితాలు వచ్చేలా నాణ్యమైన కోచింగ్ అందించాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 30 డిగ్రీ కాలేజీల్లో పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.
26 ఏకలవ్య స్కూళ్లకు ప్రతిపాదనలు
ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో 26 ఏకలవ్య పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు అందించేలా స్కూళ్ల నిర్మాణం, మౌలిక వసతులపై చర్చించారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ విజయేంద్రబోయి, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ సంతోష్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
