న్యూయార్క్‌‌లో రైలు ఢీకొని.. భారత సంతతి యువతి మృతి

న్యూయార్క్‌‌లో రైలు ఢీకొని.. భారత సంతతి యువతి మృతి
  • నేపాలీ- అమెరికన్ యువకుడు కూడా..

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారు. లోయర్ మన్‌‌హట్టన్ ప్రాంతంలోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్‌‌వే స్టేషన్‌‌లో పట్టాలపై కూర్చుని ఉన్న వారిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరు భారతీయ సంతతి యువతి కాగా, మరొకరు నేపాలీ- అమెరికన్ యువకుడిగా గుర్తించారు. 

'న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. న్యూజెర్సీలోని డేటన్‌‌కు చెందిన మలైకా చిత్రే (24), సేరివిల్లేకు చెందిన నవమ్ కౌల్ (24) లు లోయర్ మన్‌‌హట్టన్‌‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్‌‌వే స్టేషన్‌‌కు వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటల సమయంలో సౌండ్‌‌బౌండ్ నంబర్-4 రైలు వారిని ఢీకొట్టింది. రైలు ఢీకొనే కొన్ని సెకన్ల ముందు ఈ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చుని ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో స్పష్టమైంది. 

పట్టాలపై కూర్చున్న సమయంలో మలైకా చిత్రే.. నవమ్ కౌల్‌‌ను తన వైపునకు లాక్కుంటూ నవ్వుతున్నట్లుగా కనిపించిందని రైలు ఆపరేటర్ తెలిపారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. కాగా, మలైకా చిత్రే 'అకాడియా ఫార్మాస్యూటికల్స్'‌‌లో ఆపరేషన్ స్పెషలిస్ట్‌‌గా పని చేస్తుండగా, నవమ్ కౌల్ 'బ్లూమ్‌‌బెర్గ్'‌‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

వీరిద్దరూ రట్జర్స్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులే కావడం గమనార్హం. వీరి అకస్మిక మృతి పట్ల స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.