- 18న వేలాది మందితో నిరసనకు దిగుతాం
- దక్షిణ జనతా పార్టీ జాతీయ కోఆర్డినేటర్ గాలి వినోద్ కుమార్
ముషీరాబాద్, వెలుగు: ‘కల్పిత నాయకుడు’ అనే టైటిల్‌తో హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని ఈ నెల 18న విడుదల చేస్తే వేలాది మందితో అడ్డుకుంటామని దక్షిణ జనతా పార్టీ జాతీయ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్‌కుమార్ హెచ్చరించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ‘కల్పిత నాయకుడు’ అంటూ రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరినీ రాజ్యాంగం ద్వారా ఏకం చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హిందూ వ్యతిరేకి కాదని అన్నారు.
హిందూ మతంలోని కుల వ్యవస్థ, అంటరానితనం, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ చరిత్రను, రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయాలకు భిన్నంగా ‘కల్పిత నాయకుడు’ అంటూ పుస్తకం రాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఆ పుస్తకాన్ని ప్రతి దళిత మహిళ పాత చెప్పులతో సత్కరించాలని పిలుపునిచ్చారు.
టైటిల్ మార్చకుంటే తీవ్ర పరిణామాలు..
ఈ నెల 18లోగా హమారా ప్రసాద్ పుస్తక టైటిల్‌ను మార్చుకుంటే మంచిదని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని గాలి వినోద్‌కుమార్ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పుస్తకం విషయంలో బాధ్యత తీసుకుని, దాన్ని నిషేధించడంతో పాటు హమారా ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, శ్రీనివాస్, డీబీఎస్ శంకర్, స్కైలాబ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
