పంజాగుట్ట, వెలుగు: సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బండారు విజయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు కోదండరాం, అంజిరెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బీఎస్ రాములు, పాదూరి కరుణ పాల్గొన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజన్నారు.
సుమారు 13 నెలల పాటు రజాకార్ల అరాచకంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో భారత సైనిక బలగాలు చేపట్టిన చర్యలతో నిజాం పాలనకు ముగింపు పలికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైందని చెప్పారు.
ఈ పరిణామంతో తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. సీహెచ్. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కోదండరాం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ చరిత్రను ప్రజలకు, యువతకు మరింత చేరువ చేయవచ్చని
అభిప్రాయపడ్డారు.
