తెలంగాణ- ఏకేడీఎన్‌‌ బంధం మరింత విస్తరించాలి : గవర్నర్‌‌ శివప్రతాప్‌‌ శుక్లా

తెలంగాణ- ఏకేడీఎన్‌‌ బంధం మరింత విస్తరించాలి : గవర్నర్‌‌ శివప్రతాప్‌‌ శుక్లా
  • ప్రిన్స్‌‌ రహీమ్‌‌ ఆగా ఖాన్‌‌ 5తో భేటీలో గవర్నర్‌‌ శివప్రతాప్‌‌ శుక్లా

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ–ఆగా ఖాన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ నెట్‌‌వర్క్‌‌ (ఏకేడీఎన్‌‌) మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని గవర్నర్‌‌ శివప్రతాప్‌‌ శుక్లా కోరారు. ఇస్మాయిలీ ముస్లింల 50వ వారసత్వ ఇమామ్‌‌, ఆగా ఖాన్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ నెట్‌‌వర్క్‌‌ (ఏకేడీఎన్‌‌) చైర్మన్‌‌ ప్రిన్స్‌‌ రహీమ్‌‌ ఆగా ఖాన్‌‌5 సోమవారం లోక్‌‌భవన్‌‌కు వచ్చి గవర్నర్‌‌ శివప్రతాప్‌‌ శుక్లాతో భేటీ అయ్యారు. ఇమామ్‌‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత్‌‌, తెలంగాణకు ఆయన చేసిన తొలి అధికారిక పర్యటన సందర్భంగా గవర్నర్‌‌ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శుక్లా మాట్లాడుతూ హైదరాబాద్‌‌, తెలంగాణకు ప్రిన్స్‌‌ రహీమ్‌‌ ఆగా ఖాన్‌‌5 రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

దివంగత ఆగా ఖాన్‌‌4 సేవలను స్మరించుకున్నారు. భారతదేశ అభివృద్ధికి, ఏకేడీఎన్ ద్వారా సమాజ సంక్షేమానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.  హైదరాబాద్‌‌తో ఆగా ఖాన్‌‌ ట్రస్ట్‌‌ ఫర్‌‌ కల్చర్‌‌కు ఉన్న చిరకాల అనుబంధాన్ని ప్రస్తావించారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పరిసరాల అభివృద్ధిలో ఆగా ఖాన్‌‌ ట్రస్ట్‌‌ ఫర్‌‌ కల్చర్‌‌ చేపడుతున్న కార్యక్రమాలు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. విద్య, పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సేవలు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన తదితర రంగాల్లో సంస్థ చేస్తున్న కృషి స్థానిక సమాజాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తోందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌‌ సమీపంలోని ఆగా ఖాన్‌‌ అకాడమీ ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలతో భవిష్యత్‌‌ తరాల నాయకులను తీర్చిదిద్దుతున్న సంస్థగా నిలుస్తోందని అన్నారు. తెలంగాణ–ఏకేడీఎన్‌‌ మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలని గవర్నర్‌‌ ఆకాంక్షించారు.

హ్యూమన్ ​డెవలప్‌‌మెంట్‌‌కు మరింత సహకారం

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మానవాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రిన్స్‌‌ రహీమ్‌‌ ఆగా ఖాన్‌‌5 గవర్నర్‌‌కు వివరించారు. ముఖ్యంగా తెలంగాణలో పట్టణ పునరుద్ధరణ, సామాజిక ఆరోగ్య సంరక్షణ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, ఉపాధి కల్పన రంగాల్లో ఏకేడీఎన్‌‌ చేస్తున్న కృషిని వివరించారు.