ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టండి..సింగపూర్‌ బృందాన్ని కోరిన మంత్రి శ్రీధర్‌బాబు

ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టండి..సింగపూర్‌ బృందాన్ని కోరిన మంత్రి శ్రీధర్‌బాబు

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆ దేశ ప్రతినిధుల బృందాన్ని కోరారు. సెమీకండక్టర్‌ రంగంలో సింగపూర్‌కు ఉన్న సాంకేతిక, పారిశ్రామిక అనుభవాన్ని తెలంగాణతో అనుసంధానించి ఫ్యాబ్‌ పరిశ్రమలు, అనుబంధ రంగాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సింగపూర్‌ కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎనర్జీ అండ్‌ ట్రేడ్‌ శాశ్వత కార్యదర్శి ఆగస్టిన్‌ లీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం సెప్టెంబర్ 16న  సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణను ‘గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి వివరించారు. ఐటీ/ఐటీఈఎస్‌, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌, లైఫ్‌సైన్సెస్‌, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్‌, గ్రీన్‌ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్‌, అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆర్‌అండ్‌డీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఇన్నోవేషన్‌ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’లో సింగపూర్‌ ప్రభుత్వం, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొనేలా సహకరించాలని మంత్రి కోరారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ శశాంకతో పాటు సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు డా. ఫ్రాన్సిస్‌ చోంగ్‌, జీన్‌ యీ, ఆట్రీ టూన్‌  పాల్గొన్నారు.