గ్లోబల్ క్రాష్ మెుదలైంది: స్టాక్- బాండ్ మార్కెట్స్ మటాష్.. రాబర్ట్ కియోసాకీ అంచనా నిజమౌతుందా?

గ్లోబల్ క్రాష్ మెుదలైంది: స్టాక్- బాండ్ మార్కెట్స్ మటాష్.. రాబర్ట్ కియోసాకీ అంచనా నిజమౌతుందా?

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, పెట్టుబడిదారు రాబర్ట్ కియోసాకీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. 2026 సంవత్సరంలో చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అతిపెద్ద స్టాక్ అండ్ బాండ్ మార్కెట్ క్రాష్ ప్రారంభమైందని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. యూరప్, జపాన్ దేశాల నుంచి మొదలైన ఈ ఆర్థిక పతనం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని చెప్పారు

కియోసాకీ చెప్పిన ప్రధాన కారణాలు ఏమిటి?
ప్రస్తుత ఆర్థిక మాంద్యానికి కేవలం కేవలం ఒక్క కారణమే లేదని కియోసాకీ అంటున్నారు. మార్కెట్లను కుదిపేస్తున్న ప్రధాన కారణాల్లో AI ఫ్రెంజీ, ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విపరీతంగా పెరిగిపోయిన ప్రపంచ దేశాల అప్పులు, అలాగే రిటైర్మెంట్ దశకు చేరుకుంటున్న 'బేబీ బూమర్' తరం వంటి కీలక అంశాలు ఉన్నాయని కియోసాకీ చెప్పారు.

ఈ భారీ ఆర్థిక సంక్షోభం సాధారణ ఉద్యోగులు, ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కియోసాకీ హెచ్చరించారు. రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1929 నుంచి 1954 వరకు సాగిన గత మహా మాంద్యం సుమారు 25 ఏళ్లు కొనసాగిందని, సరైన ముందస్తు ఏర్పాట్లు చేసుకున్న వారు ఆ కాలంలోనూ అద్భుతంగా రాణించారని గుర్తుచేశారు.

►ALSO READ | 14 వందల పాయింట్లు కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లను నిండా ముంచిన కారణాలు ఏంటంటే?

కరెన్సీకి దూరంగా ఉండాలి: 
బ్యాంక్ రన్స్, తీవ్ర భయాందోళనలు ప్రారంభమయ్యేలోపు ప్రజలు అప్రమత్తం కావాలని కియోసాకీ సూచించారు. కాగితపు కరెన్సీని నమ్మి దాచుకోవద్దని.. భవిష్యత్తులో ప్రభుత్వాలు మళ్లీ పెద్ద ఎత్తున నోట్ల ముద్రణ ప్రారంభిస్తాయని హెచ్చరించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి తాను వ్యక్తిగత వ్యాపారాలు, ఆదాయాన్నిచ్చే రియల్ ఎస్టేట్, చమురు బావులు, అలాగే బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి అసెట్స్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు కియోసాకీ.

ఈ క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుని, ఆర్థికంగా బలపడటానికి మిక్కీ మెయిని రాసిన 'ది ఎంట్రోపీ ట్రాప్'(The Entropy Trap) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కియోసాకీ సూచించారు. ప్రస్తుత కాలంలో అత్యంత విలువైన సమాచారాన్ని అందించే ఈ పుస్తకం చదవడం వల్ల మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని అన్నారు. త్వరలోనే విస్తృతమైన ఆర్థిక సంక్షోభం రానున్నందున ప్రజలు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మరీమరీ చెప్పారు.