అమెరికా కంపెనీల ఒత్తిడితోనే UPI చెల్లింపులపై మోడీ సర్కార్ ఛార్జీలు.. రాహుల్ గాంధీ, ఖర్గే ఆగ్రహం

అమెరికా కంపెనీల ఒత్తిడితోనే UPI చెల్లింపులపై మోడీ సర్కార్ ఛార్జీలు.. రాహుల్ గాంధీ, ఖర్గే ఆగ్రహం

UPI చెల్లింపులపై మోడీ ప్రభుత్వం తీసుకున్న ఛార్జీల నిర్ణయం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రూ.2 వేల లోపు లావాదేవీలకు మాత్రమే ఎలాంటి ఛార్జీలు ఉండవని, ఆపైబడిన వాటికి మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) వర్తించేలా రూల్స్ సడలించడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఇది పేదలపై పడే అదనపు భారమని, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ప్రజల నడ్డి విరిచేలా బీజేపీ సర్కార్ నిర్ణయాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.  

రాహుల్ గాంధీ ఆగ్రహం..
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.2 వేలకు మించిన లావాదేవీలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నప్పటికీ.. అవి మొత్తం యూపీఐ విలువలో దాదాపు 65 శాతం వరకు ఉంటాయని రాహుల్ లెక్కలతో సహా బయటపెట్టారు. వ్యాపారులపై పడే ఈ భారం చివరికి వస్తువుల ధరల పెంపు రూపంలో సాధారణ ప్రజల జేబులపైనే భారం పడుతుందని ఆరోపించారు. అమెరికా చెల్లింపు సంస్థల ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలోని 'జీరో-ఎండీఆర్' విధానాన్ని మోడీ ప్రభుత్వం మార్చేస్తోందని, ప్రధాని మోడీ  రాజీపడ్డారు అంటూ రాహుల్ గాంధీ ఎండగట్టారు.

ALSO READ : వందేమాతరం సాంగ్ వివాదం.. ప్రభుత్వం ఉత్తర్వుపై కర్నాటక హైకోర్టులో పిటిషన్

మల్లికార్జున ఖర్గే కామెంట్స్..
మోడీ సర్కార్ 'యూపీఐపై ఎలాంటి ఛార్జీలు లేవు' అనే విధానాన్ని కాస్తా రూ.2 వేల పరిమితికి కుదించి ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశంలో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 10 శాతానికి దగ్గరగా ఉంటే.. ప్రభుత్వం రోజుకొక కొత్త మార్గంలో ప్రజల జేబులను గుల్ల చేస్తోందని ఆరోపించారు. రూ.5 వేల లావాదేవీపై రూ.25, రూ.10 వేలపై రూ.50 వరకు వసూలు చేసేలా నివేదికలు వస్తున్నాయని, ఇది డిజిటల్ పేమెంట్స్ టాక్స్ రూపంలో సామాన్యుల పొదుపును హరించడమేనని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.