మనుషుల మాటలను రికార్డ్ చేస్తున్న LG స్మార్ట్ టీవీలు? వివాదంపై కంపెనీ క్లారిటీ!

మనుషుల మాటలను రికార్డ్ చేస్తున్న LG స్మార్ట్ టీవీలు? వివాదంపై కంపెనీ క్లారిటీ!

LG స్మార్ట్ టీవీలపై వస్తున్న స్పైయింగ్ ఆరోపణలను ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. యూట్యూబ్ ఛానెల్ 'గేమర్స్ నెక్సస్' ఒక వీడియోలో ఎల్‌జీ టీవీలు వినియోగదారుల మాటలను నిరంతరం రికార్డ్ చేస్తున్నాయని.. వాటిని ఆటోమేటిక్‌గా ట్రాన్స్మిట్ చేస్తున్నాయని వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ.. తమ స్మార్ట్ టీవీలు ఎప్పుడూ వాడుతున్న వారికి సంబంధించిన మాటలను రికార్డ్ చేయవని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వాయిస్ రికగ్నిషన్ ఫీచర్లు ఎలా పనిచేస్తాయనే దానిపై ఎల్‌జీ స్పష్టతనిచ్చింది. సపోర్ట్ చేసే వేక్-వర్డ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు, రిమోట్‌లోని వాయిస్, ఏఐ బటన్‌ను నొక్కినప్పుడే స్పీచ్-టు-టెక్స్ట్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించింది. వేక్-వర్డ్‌ను గుర్తించడానికి ఉపయోగించే ఆడియో ప్రాసెసింగ్ కేవలం టెలివిజన్‌లో లోకల్‌గానే జరుగుతుందని చెప్పింది. వేక్-వర్డ్ కనుక గుర్తించబడకపోతే.. ఆ ఆడియో ఎట్టి పరిస్థితుల్లోనూ టెక్స్ట్‌గా మారదు, స్టోర్ కాదు అలాగే ఎక్కడికీ ట్రాన్స్మిట్ కూడా కాదని ఎల్‌జీ తేల్చిచెప్పింది.

వాయిస్ కమాండ్‌ను ప్రాసెస్ చేసే సమయంలో మాత్రమే వాయిస్-రికగ్నిషన్ ఫలితాలు, టెక్నికల్ లాగ్‌లు జనరేట్ అవుతాయని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ఇవి కేవలం యాక్టివ్ వాయిస్ సెషన్స్‌కు మాత్రమే ముడిపడి ఉంటాయని, దీనిని బట్టి బయట జరిగే సంభాషణలను నిరంతరం రికార్డ్ చేస్తున్నారనటం పూర్తిగా అవాస్తవం అని చెప్పింది. ఇక ఆటోమేటిక్ కంటెంట్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్, యాడ్స్ వంటి ఫీచర్లు ఆప్షనల్ మాత్రమేనని, ఇవి ఎప్పుడూ బై-డిఫాల్ట్ ఆన్ అయి ఉండవని తెలిపింది.

'గేమర్స్ నెక్సస్' లెటికాస్ట్ చేసిన "216,000,000 స్పై టీవీస్" అనే వీడియో ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. స్టాండ్‌బై మోడ్‌లో ఉన్నప్పుడు కూడా ఎల్‌జీ టీవీలు సంభాషణలను రికార్డ్ చేస్తున్నాయని ఆ వీడియో ఆరోపించింది. అంతేకాకుండా.. ఐపీ అడ్రస్‌లు, లొకేషన్లు, సమీపంలోని వై-ఫై నెట్‌వర్క్‌ల సమాచారాన్ని సేకరించి ట్రాన్స్మిట్ చేస్తున్నాయని పేర్కొంది. అయితే ఈ ప్రధాన ఆరోపణలన్నింటినీ ఎల్‌జీ పూర్తిగా ఖండించింది.

ALSO READ : గ్లోబల్ క్రాష్ మెుదలైంది: స్టాక్- బాండ్ మార్కెట్స్ మటాష్..

వినియోగదారుల గోప్యతను కాపాడటమే తమ ఉత్పత్తుల ప్రధాన సూత్రమని ఎల్‌జీ స్పష్టం చేసింది. ప్రైవసీ, ట్రాన్స్‌పరెన్సీని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. వినియోగదారులు తమ టీవీ సెట్టింగ్స్ ద్వారా ఈ ఆప్షనల్ ఫీచర్లను ఎప్పుడైనా మేనేజ్ చేసుకోవచ్చని.. తమ కన్సెంట్‌ను విత్ డ్రా చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో ఎల్‌జీ టీవీలు మనుషుల మాటలను రికార్డ్ చేస్తున్నాయ్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టి చెప్పేసింది సౌత్ కొరియా దిగ్గజ సంస్థ.