ఇమ్రాన్ ఖాన్‌ కోసం ఆసీస్ దిగ్గజాల తిరుగుబాటు.. షెహబాజ్ ప్రభుత్వానికి దడ! 

ఇమ్రాన్ ఖాన్‌ కోసం ఆసీస్ దిగ్గజాల తిరుగుబాటు.. షెహబాజ్ ప్రభుత్వానికి దడ! 

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం, అతడి ఆరోగ్య పరిస్థితిపై క్రికెట్ ప్రపంచం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రావల్పిండిలోని అడియాలా జైలులో నిర్బంధంలో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు కనీస వైద్య సహాయం అందించకుండా, కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసే అవకాశం ఇవ్వకుండా పాకిస్థాన్ ప్రభుత్వం వేధిస్తోందంటూ ఆస్ట్రేలియాకు చెందిన ఏడుగురు మాజీ కెప్టెన్లు రంగంలోకి దిగారు.

ఆసీస్ 7 లెజెండ్ల సంచలన నిర్ణయం: 

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు అలన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మార్క్ టేలర్, స్టీవ్ వా కలిసి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు సంయుక్తంగా ఒక ఘాటు లేఖ రాశారు. ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న రాజకీయ, చట్టపరమైన కేసులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన మాజీ కెప్టెన్లు.. కేవలం ఒక క్రీడాకారుడిగా, మానవత్వ కోణంలో ఆయనకు ప్రాథమిక మానవ హక్కులు, సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

షెహబాజ్ షరీఫ్‌కు అంతర్జాతీయ ఒత్తిడి: 

గతంలోనే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 22 మంది మాజీ కెప్టెన్లు లేఖ రాసి ఇమ్రాన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా, ప్రస్తుత ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌లతో పాటు పాకిస్థాన్ దిగ్గజాలు జావేద్ మియాందాద్, వసీం అక్రమ్, మోయిన్ ఖాన్‌లు కూడా ఇమ్రాన్ ఖాన్‌కు సపోర్టుగా నిలిచారు. ఒక దేశానికి ప్రపంచకప్ తెచ్చిపెట్టి, దేశానికే ప్రేరణగా నిలిచిన ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో పెట్టి వేధించడంపై అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం విరుచుకుపడుతుండటంతో పాకిస్థాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తీవ్ర గండం పొంచి ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.