ఆలస్యంగా వచ్చారు.. విచారణకు స్వీకరించలేం..లోతుకుంట 40 ఎకరాల భూ వివాదంపై సుప్రీం వ్యాఖ్య

ఆలస్యంగా వచ్చారు.. విచారణకు స్వీకరించలేం..లోతుకుంట 40 ఎకరాల భూ వివాదంపై సుప్రీం వ్యాఖ్య
  • ప్రభుత్వ ఎస్ఎల్పీ కొట్టివేత

న్యూఢిల్లీ, వెలుగు: మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా లోతుకుంటలోని 40 ఎకరాల భూవివాదంపై ఆలస్యంగా ఆశ్రయించారన్న కారణంతో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) ను విచారించేందుకు నిరాకరించింది. లోతుకుంట గ్రామంలోని సర్వే నం. 1,2లో ఉన్న 40 ఎకరాల భూమి తమదేనని శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్చన్స్ వాదిస్తోంది. ఇందులో  హైడ్రా, పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలు అక్రమంగా ప్రవేశించి జోక్యం చేసుకున్నాయని గతంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. 

ఈ భూమి తమ సొంత ఆస్తి అని..1955 నాటి పత్రాలు, మ్యూటేషన్ రికార్డులు తమ వద్ద ఉన్నాయని వాదించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్.. శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్చన్స్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఆగష్టు 12 న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాల్ ధర్మాసనం మంగళవారం విచారించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేయడంలో లిమిటేషన్ యాక్ట్ ప్రకారం తీవ్ర జాప్యం జరిగిందని..ఆలస్యానికి సరైన కారణాలు కూడా లేవని  మండిపడుతూ సుప్రీం ఆ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను విచారించేందుకు నిరాకరిస్తూ కొట్టివేసింది.