- 19న సాయంత్రం 4 గంటల వరకే రిపోర్టింగ్‌కు గడువు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పూర్తి చేసింది. రాష్ట్రంలోని ఓయూ, గాంధీ, కాకతీయ సహా మొత్తం 63 మెడికల్ కాలేజీల్లోని 6,200 మందికి పైగా స్టూడెంట్స్ వివరాలతో కూడిన సెలెక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఓసీకి 436 (ర్యాంకు: 1,94,546), ఈడబ్ల్యూఎస్‌కు 435 (ర్యాంకు: 1,94,845), బీసీ-ఏకు 374, బీసీ-బీకి 420, బీసీ-సీకి 384, బీసీ-డీకి 427, బీసీ-ఈకి 424, మైనార్టీకి 424, ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ-1కి 294, ఎస్సీ-2కి 386, ఎస్సీ-3కి 403, ఎస్టీకి 406 మార్కులు కటాఫ్‌గా నిలిచాయి. ఈ విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లతో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సంబంధిత కాలేజీల్లో చేరాలని వర్సిటీ అధికారులు ఆదేశించారు.
మేనేజ్‌మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్..
రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి విడత సీట్ల కేటాయింపును కూడా కాళోజీ వర్సిటీ ప్రకటించింది. కాలేజీల వారీగా అలాట్‌మెంట్ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. సీట్లు సాధించిన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బాండ్లు సమర్పించి ఈ నెల 19 సాయంత్రం 6 గంటలలోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. కాగా, విద్యార్థుల నుంచి ప్రభుత్వ జీవోలు, టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్దేశించిన నిబంధనల ప్రకారమే ట్యూషన్ ఫీజులు వసూలు చేయాలని మెడికల్, డెంటల్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు వర్సిటీ ఆదేశాలు జారీ చేసింది.
