మల్టీఫ్లెక్స్ రేంజ్ లో తిరుమలలో VVIP కంపార్ట్ మెంట్ : సామాన్యులకు కూడా ఇలా చేయగలరా స్వామీ..!

మల్టీఫ్లెక్స్ రేంజ్ లో తిరుమలలో VVIP కంపార్ట్ మెంట్ : సామాన్యులకు కూడా ఇలా చేయగలరా స్వామీ..!

తిరుమల కొండ.. తిరుమల కొండ.. కలియుగ ప్రత్యక్ష దైవం.. దేవదేవుడు వేంకటేశ్వరస్వామి కొలువైన మహా పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో నిత్యం లక్షల మంది భక్తులు స్వామి దర్శనానికి రాత్రీ పగలు తేడా లేకుండా వేచి ఉంటారు.. కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిల్చొని.. రెప్పపాటు స్వామి దర్శనానికి తహతహలాడుతుంటారు. ఎన్ని సౌకర్యాలు వచ్చినా సామాన్యులకు సరిపోవటం లేదు కానీ.. వీవీఐపీల కోసం తీసుకొస్తున్న సౌకర్యాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 

తిరుమల కొండపై VVIPలు.. అంటే సామాన్యులు కాదులేండీ.. సీఎం, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు, పారిశ్రామికవేత్తలు, డబ్బున్నోళ్లు.. నేరుగా స్వామిని దర్శించుకుని పూజలు చేసే గొప్ప గొప్పోళ్ల కోసం  ప్రత్యేక కంపార్ట్ మెంట్ సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. 

ఈ ప్రత్యేకమైన కంపార్ట్ మెంట్ ఎలా ఉంది అంటే.. సామాన్యుల భాషలో.. సింపుల్ గా చెప్పాలంటే మల్టీఫ్లెక్స్ ధియేటర్ తరహాలో అద్భుతంగా ఉంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి తిరుమల కొండ వచ్చే అత్యంత ప్రముఖ వ్యక్తుల కోసం ఈ మల్టీఫ్లెక్స్ తరహా VVIP కంపార్ట్ మెంట్ సిద్ధం చేశారు అధికారులు. 

ఈ VVIP కంపార్ట్ మెంట్ ప్రత్యేక ఏంటంటే.. ఇది అంతర్జాతీయ విమాశ్రయంలో లాంజ్ ఉంటుంది కదా.. అలాంటి ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. మన సామాన్యుల వెర్షన్ లో అయితే మల్టీఫ్లెక్స్ ధియేటర్ రేంజ్ లో ఈ కంపార్ట్ మెంట్ ను రూపొందించారు. సీటింగ్ అలాగే ఉంటుంది. ముందు పెద్ద LED స్క్రీన్.. ఆ స్క్రీన్ పై వేంకటేశ్వర స్వామి భక్తి ఛానెల్ ప్రసారం అవుతూ ఉంటుంది. అత్యంత ప్రముఖలు స్వామి దర్శనానికి వచ్చిన సమయంలో.. స్వామి దర్శనానికి వెళ్లటానికి ముందు ఈ వీవీఐపీ కంపార్ట్ మెంట్ లో వేచి ఉంటారు. స్వామి దర్శనం కొంచెం.. కొన్ని నిమిషాలు ఆలస్యం అయితే.. మల్టీ్ఫ్లెక్స్ తరహాలో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన ఈ VVIP కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తారు. వీరి కోసం దీనికి ప్రత్యేకంగా రూపొందించారు టీటీడీ అధికారులు. 

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17వ కంపార్ట్‌మెంట్‌ను ఈ విధంగా సరికొత్తగా మార్పులు చేశారు. ఆధునిక ఇంటీరియర్... ఆకట్టుకునే లైటింగ్... భారీ డిజిటల్ స్క్రీన్... ఇలా లోపల అడుగుపెడితే ఓ ప్రీమియం మల్టీప్లెక్స్‌ను తలపించేలా ఈ కేంద్రాన్ని.. ఈ కంపార్ట్ మెంట్ ను తీర్చిదిద్దారు. సీఎం చంద్రబాబు ఈ కేంద్రాన్ని తన చేతులతో ప్రారంభించారు.  మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా తిరుమల దర్శన అనుభూతిని కూడా సీఎం వీక్షించారు.

ఈ అత్యాధునిక కంపార్ట్ మెంట్ లోకి సామాన్య భక్తులకు కూడా ప్రవేశం ఉంటుందా..? లేక ప్రత్యేక అతిథులు, వీవీఐపీల సందర్శనకే పరిమితం అవుతుందా..? సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తే... వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉండే సమయాన్ని ఓ ఆధ్యాత్మిక అనుభూతిగా మార్చే సరికొత్త వేదికగా ఇది నిలిచే అవకాశం ఉంది.