పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. శాలువా కోసం టీడీపీ నేతల చీప్ ఫైట్..!

పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. శాలువా కోసం టీడీపీ నేతల చీప్ ఫైట్..!

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో కాల్పులు కలకలం రేపాయి. వినాయకుడి విగ్రహం దగ్గర మొదలైన గొడవ చివరకు కాల్పులకు దారి తీసింది. వివరాల ప్రకారం.. పులివెందులలో ఏర్పాటు చేసిన గణనాథుడిని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ బీటెక్ రవి సోమవారం (సెప్టెంబర్ 14) రాత్రి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నేత పుష్పనాథరెడ్డి బీటెక్ రవికి శాలువా కప్పి సత్కరించారు. 

అయితే, బీటెక్ రవికి శాలువా కప్పి తనకు కప్పలేదని మరో టీడీపీ నేత విజయ్ కక్ష పెట్టుకున్నాడు. దీంతో బీటెక్ రవి వెళ్ళిపోగానే పుష్పనాథరెడ్డిపై విజయ్ దాడి చేశాడు. తన వర్గాన్ని కూడగట్టుకుని పుష్పనాథరెడ్డి కూడా ఎదురు దాడికి దిగాడు. విజయ్ ఇంటిపైకి రాళ్లు విసిరారు. ఈ ఘటనలో విజయ్ ఇంటివద్ద నిలిపిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. 

పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఇరువర్గాలను శాంతింపజేసేందుకు హజ్ కమిటీ డైరెక్టర్ భాషా రంగంలోకి దిగారు. అయితే, ఆయన అక్కడకు వెళ్లిన సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారింది. దీంతో భాషా గన్‎మెన్ రబ్బానీ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. తుపాకీ మోతతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.