స్నైపర్స్ రక్షణలో అయోధ్య రామ మందిరం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

స్నైపర్స్ రక్షణలో అయోధ్య రామ మందిరం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

అయోధ్యలోని రామ మందిరంతో పాటు రాష్ట్రంలోని అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌లకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా బలగాల ఆధునీకరణలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సరికొత్త సెక్యూరిటీ, ఆయుధాల కొనుగోలు ప్రణాళికకు ఆమోదం తెలిపింది. దీంతో యూపీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు కానుంది.

ఈ ప్రత్యేక భద్రతా ప్రణాళికలో భాగంగా రామ మందిరంతో పాటు మెట్రో సౌకర్యాలు, రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, లోక్ భవన్, హైకోర్టు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల వద్ద అత్యాధునిక స్నైపర్లను మోహరించనున్నారు. ఈ రక్షణ బాధ్యతలను నిర్వర్తించే ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కోసం అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, నిఘా పరికరాలను సమకూరుస్తోంది యోగి ప్రభుత్వం.

పోలీస్ మోడరైజేషన్ స్కీమ్ కింద ఈ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒక్కోటి రూ.10.76 లక్షల ఖర్చుతో మూడు అత్యాధునిక స్నైపర్ రైఫిల్స్‌ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అలాగే రక్షిత ప్రాంతాల్లో నిఘా సామర్థ్యాలను మెరుగుపరచడానికి 14 టెలిస్కోప్ సెర్చ్ మిర్రర్లను కూడా సమకూరుస్తున్నట్లు సమాచారం.

అయోధ్య రామ మందిరంలో ఈ భద్రతా పెంపుదల, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో జరుగుతున్న పరిపాలనా పునర్నిర్మాణాల మధ్య ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌కు నేతృత్వం వహించిన మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఇటీవల ట్రస్ట్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అయోధ్యకు చేరుకుని ట్రస్ట్ సమావేశంలో పాల్గొని పరిపాలనా వ్యవహారాలపై సమీక్షించారు.

మొత్తంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు, భద్రతా మౌలిక సదుపాయాలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా యోగి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రతినిధుల భద్రతా సిబ్బంది వద్ద ఉన్న పాత ఆయుధాలను మార్చడంతో పాటు.. ఉగ్రవాద వ్యతిరేక చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకు ప్రస్తుత ప్లాన్ దోహదపడుతుందని సర్కార్ భావిస్తోంది.