తమిళనాడులోని కాంచీపురం ఆలయంలో మరోసారి పూజారుల మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో ఆలయ ప్రాంగణంలోనే బాహాబాహీకి దిగారు. దీంతో పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇటీవలే ఒక అంగీకారినికి వచ్చిన ఇరు వర్గాలు మళ్లీ గొడవలకు దిగటం ఆందోళన కలిగించే అంశం.
వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురం దేవరాజస్వామి ఆలయంలో మరోసారి వడగలై–తెంగలై వర్గాల మధ్య వివాదం రాజుకుంది. 2026 సెప్టెంబర్ 14వ తేదీన ఆలయ ప్రాంగణంలోని శ్రీ వేదాంత దేశికన్, తాత దేశికన్ సన్నిధుల్లో ఉత్సవాల సందర్భంగా దివ్యప్రబంధం, మంత్రపుష్పం పఠించే విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
కోర్టు ఆదేశాలను పాటించడం లేదంటూ ఇరువర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వివాదం కారణంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
దివ్యప్రబంధం, మంత్రపుష్పం పఠించే విషయంలో మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీయడంతో ఆలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఉన్న కోర్టు ఆదేశాలను ప్రత్యర్థి వర్గం సక్రమంగా పాటించడం లేదని ఇరుపక్షాలు పరస్పరం ఆరోపిస్తున్నాయి.
కోర్టు ఆదేశాలను అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని... ఇరువర్గాల మధ్య వివాదాలకు తావులేకుండా ఆలయ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
కాంచీపురం ఆలయంలో వైష్ణవ పూజారుల మధ్య శతాబ్దాలుగా వివాదం నడుస్తోంది. తెంగలై (ద్రవిడ సంప్రదాయం), వడగలై (ఉత్తర సంప్రదాయం) అనే రెండు ఐయంగార్ శాఖల పూజరుల మధ్య వివాదం కొనసాగుతోంది. దాదాపు 200 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగుతోంది.
2025లో డిసెంబర్ 2025లో మద్రాస్ హైకోర్టు ఈ ఆలయంలో తెంగలై శాఖకు ఉన్న ప్రత్యేక ఆచార హక్కులను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దీంతో వడగలై వర్గం సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో.. 2026 జనవరి 28న ఇరు వర్గాల మధ్య శాంతియుత ఒప్పందం కుదిర్చేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ను నియమించింది. కొన్నాళ్లు శాంతియుత వాతావరణం కనిపించినప్పటికీ.. మరోసారి.. 2026 సెప్టెంబర్ లో ఆలయంలోని శ్రీ వేదాంత దేసికన్ సన్నిధిలో దివ్య ప్రబంధం, మంత్ర పుష్పం పఠనంపై ఇరు వర్గాల మధ్య మరోసారి తాజా వాగ్వాదం చోటుచేసుకోవడం గమనార్హం.
