బెంగాల్ రాజకీయాల్లో సంచలనం: CM సువేందు అధికారి దివంగత పీఏ తల్లికి MLA టికెట్

బెంగాల్ రాజకీయాల్లో సంచలనం: CM సువేందు అధికారి దివంగత పీఏ తల్లికి MLA టికెట్

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్‎లోని నందిగ్రామ్, రేజినగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. రెజినగర్ నుంచి సఖరవ్ సర్కార్‌‎ను బరిలోకి దించుతోంది. రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నందిగ్రామ్ నుంచి సీఎం సువేందు అధికారి దివంగత పీఏ చంద్రనాథ్ రథ్ తల్లి హసిరానీ రథ్‌కు టికెట్ కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో టీఎంసీని ఓడించి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దుండగులు అతడిని కాల్చి చంపారు. 

హసిరానీ రథ్‌ బ్యాగ్రౌండ్ ఇదే

62 ఏళ్ల హసిరానీ రథ్‌ తూర్పు మేదినీపూర్‌లోని చండీపూర్ ప్రాంతంలోని కులుప్ గ్రామానికి చెందినవారు. ఆమె స్థానిక రాజకీయాల్లో చురుకుగా ఉంటూ పంచాయతీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా పనిచేశారు. మొదట్లో ఆమె మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఉండేవారు. ఆ తర్వాత సువేందు అధికారి టీఎంసీని వీడి బీజేపీలో చేరినప్పుడు హసిరానీ రథ్‌ కూడా తన కుటుంబంతో కలిసి కాషాయతీర్థం పుచ్చుకున్నారు.

 హసిరానీ రథ్ కుటుంబానికి సువేందు అధికారి ఫ్యామిలీతో రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన రాజకీయ, వ్యక్తిగత బంధం ఉంది. సువేందు అధికారి రాజకీయ ఎదుగుదల తొలినాళ్ల నుంచి రథ్ కుటుంబం ఆయనకు అండగా నిలిచింది. హసిరానీ రథ్ కుమారుడు చంద్రనాథ్ రథ్ సువేందు అధికారి దగ్గర వ్యక్తిగత సహయకుడిగా పని చేసేవాడు. 

ఈ ఏడాది మే నెలలో టీఎంసీని ఓడించి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యాడు. కొడుకును కోల్పోయిన తీవ్ర శోకంలో ఉన్న రథ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు నందిగ్రామ్ ఉప ఎన్నిక బరిలో చంద్రనాథ్ తల్లి హసిరానీ రథ్‌‎ను బీజేపీ బరిలోకి దించుతోంది. 

ఉప ఎన్నిక ఎందుకంటే..?

వెస్ట్ బెంగాల్ సీఎం సువేందు అధికారి రాజీనామాతో నందిగ్రామ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2026 బెంగాల్ ఎన్నికల్లో సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీని చిత్తుచేసిన భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ నందిగ్రామ్‎ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. ఇప్పటికే టీఎంసీ, టీఎం రెబల్ గ్రూప్, కాంగ్రెస్, సీపీఐ నందిగ్రామ్ ఉప ఎన్నికకు తమ అభ్యర్థులను ప్రకటించాయి.