అమెరికాలో ఘోర ప్రమాదం.. రైలు వస్తుండగా పట్టాలపైనే ఉండిపోయారు.. ఇద్దరు ఎన్నారై ఫ్రెండ్స్ మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం.. రైలు వస్తుండగా పట్టాలపైనే ఉండిపోయారు..  ఇద్దరు ఎన్నారై ఫ్రెండ్స్ మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రైలు వస్తుండగా సబ్ వేలో పట్టాలపై కూర్చుని ఉండిపోయిన యువతీ, యువకుడు చనిపోయారు. రైలు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. న్యూజెర్సీలోని లోయర్ మన్హటన్ స్టేషన్ లో జరిగిన ఈ ప్రమాదంలో భారత సంతతి యువతి మలైకా చిత్రే (24), నవమ్ కౌల్ (24) చనిపోయారు. 

స్ప్రింగ్ స్ట్రీట్ సబ్ వేలో రైలు వస్తుండగా ఇద్దరూ పట్టాలపై కూర్చుని ఉండిపోయారని పోలీసులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో రైలు ఢీకొట్టడంతో చనిపోయినట్లు న్యూయార్క్ పోలీసులు వెల్లడించారు. 

కాపాడాలనుకుందా.. కావాలనే కూర్చున్నారా..?

ఈ ఘటనకు సంబంధించి స్టేషన్ లో ఉన్న మరో వ్యక్తి తీసిన వీడియో వైరల్ గా మారింది. వీడియో ప్రకారం ప్రమాదానికి ఒక సెకన్ ముందు కూడా కూర్చోనే ఉండటం ఆందోళన కలిగించే అంశం. అయితే ఇద్దరూ మత్తులో ఉన్నారని భావిస్తున్నారు.  మత్తులో ట్రాక్ పై పడిపోయిన స్నేహితుడిని కాపాడేందుకు చిత్రే కూడా దిగిందని.. అంతలోనే ట్రైయిన్ డీకొట్టిందని చెబుతున్నారు. 

ట్రైయిన్ ఆపరేటర్ ప్రకారం..

  ట్రైన్ ఆపరేటర్ చెప్పిన విషయం షాకింగ్ కు గురిచేస్తోంది. రైలు సమీపిస్తుండగా ట్రాక్ పైనే కూర్చున్న ఇద్దరిలో.. చిత్రే తన ఫ్రెండ్ కౌల్ ను తనవైపు లాక్కోవడం చూసినట్లు చెప్పారు. అదే విధంగా ఆమె గట్టిగా నవ్వుతున్నట్లు గమనించినట్లు తెలిపారు.

 బాధితులు ఇద్దరూ ట్రాక్ పై పడిపోయి ఉండవచ్చు.. పైకి లాగేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరూ ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ట్రైన్ సూపర్ వైజర్ ట్రాక్ పైన కూర్చున్న ఇద్దరినీ చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేయటానికి ప్రయత్నించగా.. బ్రేకులు పడలేదని తెలిపారు. 

ఘటన జరిగిన తర్వాత రైలును అక్కడే ఆపేశారు. రైలులో ఉన్న వంద మంది ప్యాసెంజర్లకు వేరే మార్గాల వాహనాలు ఏర్పాటు చేశారు. 

 ఇది ఆత్మహత్యనా లేక మత్తులో ఉండి ప్రమాదాన్ని ఊహించలేక పోయారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తీవ్రమైన మత్తు కారణంగానే రైలు వస్తున్నా అలాగే ట్రాక్ పైన కూర్చుండి పోయారని భావిస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్స్ లభ్యం కాలేదని చెబుతున్నారు. 

అకాడియా ఫార్మాసూటికల్స్ లో ఆపరేషన్ స్పెషలిస్టుగా చిత్రే పనిచేస్తుండగా.. కౌల్ బ్లూంబర్గ్ లో ఫైనాన్షియల్ డేటా అనలిస్టుగా పనిచేస్తున్నాడు. లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం ఇద్దరూ రట్జర్స్ (Rutgers University) యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అని తెలుస్తోంది.