తెలుగులో మిస్టరీ, డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కలిసిన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుమంత్, మీనాక్షి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటించగా.. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే, ఈ మూవీ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలై మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటకు రావడంతో ఆసక్తి పెరిగింది.
మహేంద్రగిరి వారాహి ఓటీటీ రిలీజ్..!
మిస్టరీ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ‘మహేంద్రగిరి వారాహి’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మూవీ అందుబాటులోకి రానుంది. IMDBలో ఈ సినిమాకు 9.5 రేటింగ్ వచ్చినట్లు సమాచారం.
అసలు కథ ఏంటి?
మహేంద్రగిరి సంస్థానం చుట్టూ తిరిగే ఈ కథలో దాదాపు 200 ఏళ్ల నాటి రాజవంశ శాపం ప్రధానమైన అంశం. ఆ వంశంలోని మగవారికి 33 ఏళ్లు నిండగానే ప్రాణాలు కోల్పోయే గండం ఉంటుంది. దీని వెనుక వారాహి అమ్మవారి శాపమే ఉందని కుటుంబ సభ్యులు నమ్ముతుంటారు.
ఇదిలా ఉంటే.. దేవుళ్లు, దెయ్యాల పేరుతో జరిగే మోసాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెట్టే సిద్ధార్థ్ పాత్రలో సుమంత్ కనిపిస్తాడు. తన అన్నయ్య రాజీవ్‌తో కలిసి మహేంద్రగిరి ఆలయానికి వచ్చిన అతడికి ఊహించని విషాదం ఎదురవుతుంది. తన అన్న మరణం సాధారణం కాదని అనుమానించిన సిద్ధార్థ్.. ఆ రాజవంశాన్ని వెంటాడుతున్న శాపం వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకునేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు.
సినిమాలో ట్విస్టులు ఏంటి?
సినిమా ఫస్ట్ హాఫ్‌లో రాజవంశం, శాపం, ఆలయం, వరుస మరణాల చుట్టూ క్యూరియాసిటీ పెంచుతూ కథను నడిపించారు. అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా 200 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఆ శాపం నిజంగానే ఉందా? వరుస మరణాల వెనుక దైవశక్తి ఉందా? లేక మరేదైనా మిస్టరీ దాగి ఉందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి.
సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే రెండు కీలక ట్విస్టులు సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయని రివ్యూలు చెబుతున్నాయి. వారాహి అమ్మవారి విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్‌ను పెంచేలా ఉన్నాయని ప్రశంసలు వచ్చాయి.
సుమంత్‌కి మరో డిఫరెంట్ మూవీ!
ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్ ఎంచుకునే సుమంత్.. ఈ సినిమాలో మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ నిజాలను అన్వేషించే వ్యక్తిగా కనిపించాడు. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన బలం కాగా, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ పాత్రలు కూడా టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు కాస్తా రిలీఫ్ ఇచ్చింది.
బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి ఏంటి?
సెప్టెంబర్ 11న విడుదలైన ‘మహేంద్రగిరి వారాహి’కి తొలిరోజు పెద్దగా కలెక్షన్లు నమోదు కాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు వచ్చిన టాక్ మిక్స్‌డ్‌గా ఉంది. కొంతమంది ప్రేక్షకులు కథ, మిస్టరీ, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విస్టులను మెచ్చుకోగా.. మరికొందరు సినిమా నిడివి, స్లో నరేషన్, సెకండాఫ్‌లో రిపిటేటివ్‌గా అనిపించే సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి.
