విద్యుత్ పొదుపుతో ఆర్థికాభివృద్ధి.. AI టెక్నాలజీతో విద్యుత్ వృథాను తగ్గించాలి : భట్టి విక్రమార్క

విద్యుత్ పొదుపుతో ఆర్థికాభివృద్ధి.. AI టెక్నాలజీతో  విద్యుత్ వృథాను తగ్గించాలి : భట్టి విక్రమార్క

హైదరాబాద్: విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో పాటు విద్యుత్‌ను పొదుపుగా, సమర్థవంతంగా వినియోగించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అవసరం లేకుండా వినియోగించకుండా ఆదా చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌ను చౌకైన విద్యుత్‌గా చూడాలనిన్నారు.ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ పరిరక్షణ కోణంలోనే కాకుండా ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే అంశంగా చూడాలని భట్టి విక్రమార్క సూచించారు. పరిశ్రమల్లో మెరుగైన మోటార్లు, ఆధునిక శీతలీకరణ వ్యవస్థలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ విధానాలను అమలు చేయడం ద్వారా విద్యుత్ వృథాను తగ్గించవచ్చన్నారు.

ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్ తగ్గితే విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్‌లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పరిశ్రమలు, తయారీ రంగం, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల విస్తరణతో విద్యుత్ అవసరం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రతి యూనిట్‌తో ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు

అభివృద్ధిని తగ్గించడం పరిష్కారం కాదని, ప్రతి యూనిట్ విద్యుత్‌తో ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు సాధించేలా చూడాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం తగ్గితే నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయని, పీక్ డిమాండ్ తగ్గడం వల్ల విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలపై భారం తగ్గుతుందని వివరించారు.విద్యుత్ పొదుపు ద్వారా దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయవచ్చన్నారు. ప్రతి యూనిట్ విద్యుత్‌ను ఆదా చేయడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఒక పరిశ్రమలో విజయవంతమైన టెక్నాలజీని ఇతర పరిశ్రమలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఇప్పటికే అనేక మంచి పైలట్ ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పెద్ద స్థాయిలో అమలు చేయడమే ముందున్న సవాలు అని పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీ ఏంటి అనే దానితో పాటు ఇప్పటికే విజయవంతంగా పనిచేస్తున్న టెక్నాలజీలను గుర్తించి విస్తరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

AIతో విద్యుత్ వృథాకు అడ్డుకట్ట

పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్ ద్వారా ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచాలని భట్టి విక్రమార్క అన్నారు. AI ఆధారిత సాంకేతికతలను వినియోగించి విద్యుత్ వృథాను గుర్తించి, వినియోగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాలని సూచించారు.భవిష్యత్‌లో కర్మాగారాలు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు ప్రధానంగా కొలవడం, పంచుకోవడం, విస్తరించడం అనే మూడు అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఎనర్జీ ఎఫిషియెన్సీని ఏడాదికి ఒకసారి నిర్వహించే ఆడిట్‌గా కాకుండా నిరంతర ప్రక్రియగా మార్చాలని అన్నారు. విజయవంతమైన ఇంధన సామర్థ్య విధానాలు, టెక్నాలజీలను ఇతర సంస్థలతో పంచుకోవాలని సూచించారు.

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం

ప్రభుత్వం, పరిశ్రమలు, టెక్నాలజీ సంస్థలు, ఆర్థిక సంస్థలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. వాణిజ్యపరంగా విజయవంతమైన టెక్నాలజీలు కొన్ని పెద్ద సంస్థలకే పరిమితం కాకుండా అన్ని పరిశ్రమలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు తెలివిగా, సమర్థవంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైనంత విద్యుత్ అందించడంతో పాటు ప్రతి యూనిట్ విద్యుత్‌తో ఎక్కువ ఫలితం సాధించేలా చూడాలని పేర్కొన్నారు.

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మెరుగైన రహదారులు, ఔటర్ రింగ్ రోడ్ వంటి సదుపాయాలు రాష్ట్రానికి బలంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, పారిశ్రామిక, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు.పెట్టుబడిదారులను తెలంగాణ ప్రభుత్వం సంపద సృష్టికర్తలుగా చూస్తోందని అన్నారు. సంపద సృష్టించే ప్రతి ఒక్కరికీ తెలంగాణలో స్వాగతం పలుకుతున్నామని, కలిసి ఎదగడానికి రాష్ట్రానికి వచ్చి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం

చిన్న రాష్ట్రం అయినప్పటికీ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా అన్ని రంగాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడిదారులు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.గత ఏడాది గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ ఏడాది డిసెంబర్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఈ సమ్మిట్‌కు హాజరై తెలంగాణ రైజింగ్ లో భాగస్వాములు కావాలని కోరారు.

పెట్టుబడులు, పరిశ్రమలు, సంపద సృష్టి ద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక వసతులను ప్రభుత్వం బలోపేతం చేస్తోందని తెలిపారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. కలిసి అభివృద్ధిని సాధిద్దాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.