- అందుకే విమోచన దినోత్సవం నిర్వహిస్తలేరు: కిషన్ రెడ్డి
- కేంద్రం ఆధ్వర్యంలోనే హైదరాబాద్ ముక్తి దివస్
- పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి చీఫ్ గెస్ట్
- హైదరాబాద్‌ను ఉస్మానిస్థాన్‌గా మార్చేలా నిజాం కుట్ర
- పోరాట చరిత్రను ప్రజలకు చాటేందుకే విమోచన దినం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
- చార్మినార్ వద్ద మహిళా మోర్చా స్కూటీ ర్యాలీ
హైదరాబాద్/చార్మినార్, వెలుగు: మజ్లిస్ (ఎంఐఎం) పార్టీకి భయపడి ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు వెనకాడుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన మహిళా శక్తి స్కూటీ ర్యాలీ ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆడబిడ్డలు రోకలిబండలు, కారపు ముద్దలతో ధైర్యంగా పోరాడి రజాకార్లను గ్రామ సరిహద్దుల దాకా తరిమికొట్టిన చరిత్ర మనదన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలే హైదరాబాద్ విముక్తి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో మాత్రం ఎంఐఎంకు భయపడి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వెనకడుగు వేయడంతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఏటా అధికారికంగా హైదరాబాద్ ముక్తి దివస్ నిర్వహిస్తోందని చెప్పారు.
ఓటుబ్యాంకు రాజకీయాలే కారణం
నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ఆర్య సమాజీల సేవలను మరవలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. హైదరాబాద్‌ను ప్రత్యేక రాజ్యంగా ఉంచి, ‘ఉస్మానిస్థాన్’గా మార్చి పాకిస్థాన్‌తో కలపాలని నిజాం చూశారని ఆరోపించారు. నిజాం, రజాకార్ల నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు పైశాచిక హింసను అనుభవించారని, ఆ రాక్షసత్వాన్ని ఎదిరించి వందేమాతరం రామచంద్రరావు, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్‌తో పాటు ఎంతోమంది వీరులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వేలాది మంది మహిళలు కూడా ఈ పోరాటంలో మానప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ పోరాట చరిత్రను, అమరుల త్యాగాలను సమాజానికి తెలియజేయడంలో పాలక ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వాలు ఎందుకు వెనకాడుతున్నాయో చూస్తే.. అందుకు ఓటు బ్యాంక్ రాజకీయాలే కారణమని స్పష్టమవుతుందన్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఆడబిడ్డ ధైర్యానికి, ఆత్మగౌరవానికి మారుపేరని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శశికళ, ఉమా మహేందర్, జే నిరంజన్ యాదవ్, సుభాష్ చంద్రజీ, ఆలే భాస్కర్, రూప్‌రాజ్ పాల్గొన్నారు.
విమోచన దినోత్సవానికి ఉప రాష్ట్రపతి చీఫ్ గెస్ట్
ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ‘హైదరాబాద్ ముక్తి దివస్’ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పాటు పలువురు ఎంపీలు, ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. మంగళవారం పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం భద్రత, ట్రాఫిక్ మళ్లింపు, వీఐపీ ప్రొటోకాల్ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 17న జరిగే
చారిత్రక వేడుకల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున భాగస్వాములై తెలంగాణ పౌరుషాన్ని, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
