హనుమకొండ, వెలుగు: హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలో మంగళవారం భారీ వృక్షం అకస్మాత్తుగా విరిగి పడటంతో మూడు ఆటోలు, రెండు బైకులు, చిరువ్యాపారుల స్టాల్స్ ధ్వంసమయ్యాయి. అదే సమయంలో సిరిసిల్ల నుంచి వరంగల్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సుపైనా చెట్టు పడింది. అయితే ఎవరూ గాయపడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెట్టుకు కరెంట్ వైర్లు ఉండగా, బస్సు వాటిని తగలడంతో చెట్టు విరిగిపడినట్లు స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకటరత్నం, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చెట్టు కూలడంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లు, చిరువ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
