- సామాన్యుడికి న్యాయం జరిగినప్పుడే అసలైన సాంకేతిక విజయమని కామెంట్
- నోవాటెల్‌లో లీగల్ ఎరా ఇండియా కాన్‌క్లేవ్ 2026 ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) న్యాయమూర్తుల నిర్ణయ ప్రక్రియకు సాంకేతికంగా మాత్రమే సాయపడగలదని, న్యాయమూర్తి అంతరాత్మను, విచక్షణను, మానవీయ ఆలోచనా విధానాన్ని అది ఎప్పటికీ భర్తీ చేయలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా స్పష్టం చేశారు. నగరంలోని నోవాటెల్‌లో మంగళవారం నిర్వహించిన ప్రతిష్టాత్మక 15వ వార్షిక లీగల్ ఎరా ఇండియా కాన్‌క్లేవ్ 2026 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
చట్టం, సాంకేతికతల సమన్వయంతోనే భవిష్యత్ న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతుందన్నారు. కోర్టులు తమ రాజ్యాంగబద్ధ బాధ్యతలను మరింత వేగంగా నిర్వర్తించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సామాన్యుడికి న్యాయం జరిగినప్పుడే అసలైన సాంకేతిక విజయం సిద్ధిస్తుందన్నారు.
టెక్నో–లీగల్ ప్రొఫెషనల్స్ డిమాండ్..
రానున్న రోజుల్లో సైబర్ సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్, డేటా ప్రొటెక్షన్ వంటి ఆధునిక అంశాలపై పట్టున్న టెక్నో–లీగల్ ప్రొఫెషనల్స్ అవసరం ఎంతో పెరుగుతుందన్నారు. న్యాయ విద్యలోనూ ఈ మార్పులకు అనుగుణంగా సిలబస్ ఉండాలని జస్టిస్ నందా సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్, టెక్నాలజీ నియంత్రణ వంటి కొత్త రంగాలపై న్యాయవాదులకు అవగాహన అవసరమని పేర్కొన్నారు.
అనంతరం కార్పొరేట్ పాలన, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ప్రతిభ కనబరిచిన పలువురు ఇన్-హౌస్ లీగల్ ప్రొఫెషనల్స్‌కు ఆమె అవార్డులను ప్రదానం చేశారు. ఈ సదస్సులో సీనియర్ అడ్వకేట్ కృష్ణ గ్రంధి, పలువురు న్యాయ నిపుణులు సహా డాక్టర్ రెడ్డీస్, క్వాల్‌కామ్, సైయెంట్, మెడికవర్, అపోలో వంటి దిగ్గజ సంస్థల కార్పొరేట్ లీగల్ హెడ్స్, ప్రముఖ లా ఫర్మ్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
