హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఓ యువకుడు పట్టపగలే నడిరోడ్డుపై సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపింది. వరంగల్ నిట్ వెళ్లే మార్గంలోని డివైడర్‌పై యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వద్ద రైలు టికెట్, సెల్‌ఫోన్ లభించాయి. రైలు టికెట్ ఆధారంగా అతడు మహారాష్ట్రలోని బల్లార్షకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగా మృతుడి వివరాలను సేకరిస్తున్నారు.
మృతుడు వరంగల్‌కు ఎందుకు వచ్చాడు, ఎవరితో చివరిసారిగా మాట్లాడాడు, ఘటనకు కారణాలేంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సుబేదారి సీఐ రంజిత్‌కుమార్ తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
