అల్వాల్‌లో బాలికపై గ్యాంగ్ రేప్..మత్తు పదార్థాలు ఇచ్చి అఘాయిత్యం

అల్వాల్‌లో బాలికపై గ్యాంగ్ రేప్..మత్తు పదార్థాలు ఇచ్చి అఘాయిత్యం
  • 8 మంది అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

అల్వాల్, వెలుగు: ఓ బాలికపై గ్యాంగ్​రేప్​జరిగిన ఘటన హైదరాబాద్‌ అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాలికను మత్తు పదార్థాలకు అలవాటు చేసి, వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటర్ చదువుతున్న బాలికకు గతంలో జర్నీ వరుణ్‌తో పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న వరుణ్.. ఆ బాలికకు గంజాయి, మద్యం తదితర మత్తు పదార్థాలను అలవాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమెను కార్లు, రైల్వే స్టేషన్లు, రైలు బోగీలు, హోటల్ గదులు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 10న నిందితులు వరుణ్, నీరజ్, విక్కీ, నిఖిల్, గణేశ్ మరోసారి బాలికను వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. వారి నుంచి తప్పించుకున్న ఆమె నేరుగా ఇంటికి చేరుకుంది.

జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు అల్వాల్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిక్కీ (29), నీరజ్ (23), నిఖిల్ (21), జర్నీ వరుణ్ (20), ఆర్.వరుణ్ (22), సంజయ్ కుమార్ (23), చైతన్య (22), సి. రాజు (35)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు? ఈ ఘటనలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో విచారణ చేపట్టారు.