కండ్లల్లో కారం కొట్టి.. వేటకొడవళ్లతో  నరికి హత్య..హైదరాబాద్ నాగోల్లో రౌడీషీటర్ మర్డర్ 

కండ్లల్లో కారం కొట్టి.. వేటకొడవళ్లతో  నరికి హత్య..హైదరాబాద్ నాగోల్లో రౌడీషీటర్ మర్డర్ 
  •    హైదరాబాద్ నాగోల్​లో రౌడీషీటర్ మర్డర్ 
  •     చిన్ననాటి ఫ్రెండ్, తోటి రౌడీ షీటర్ పనేనని అనుమానాలు 
  •     ఖమ్మం, ఇల్లందు, కొత్తగూడెంలో ఇద్దరూ కలిసి సెటిల్మెంట్లు
  •     సోలార్ ప్యానెల్స్ డీలర్షిప్, సెటిల్మెంట్ డబ్బులపైనా గొడవలు


ఎల్బీనగర్/భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: హైదరాబాద్‌ నాగోలు బండ్లగూడలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. వైన్స్ సిట్టింగ్ ఏరియాలో మందు తాగుతుండగా అతడి కండ్లల్లో కారం కొట్టి, వెంటాడుతూ.. కత్తులతో పొడిచి, వేటకొడవళ్లతో నరికి కొందరు దారుణంగా హత్య చేశారు. సోమవారం జరిగిన ఈ మర్డర్‌‌ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. హతుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే కాలనీకి చెందిన నయీం(34) కాగా, అతడిని చిన్ననాటి స్నేహితుడు, తోటి రౌడీషీటర్ మహేశ్ అలియాస్​ఉమా మహేశ్వర్​రావు చంపించాడని అనుమానిస్తున్నారు.

వీరిద్దరికీ సోలార్ రూఫ్ టాప్ డీలర్షిప్, సెటిల్మెంట్ల డబ్బు విషయంలో ఇటీవల గొడవలు జరిగాయి. దీంతో తనను చంపేందుకు నయీం స్కెచ్ వేశాడని తెలుసుకున్న మహేశ్.. రివర్స్ స్కెచ్ వేసి, ఈ హత్య చేయించినట్టుగా భావిస్తున్నారు. బండ్లగూడలోని సుప్రీం వైన్స్ వద్ద సిట్టింగ్ ఏరియాలో సోమవారం రాత్రి 9:15 గంటలకు ఇల్లెందుకు చెందిన రవి, ఖమ్మానికి చెందిన సాయి, వెంకటేశ్‌తో కలిసి నయీం మందు తాగుతుండగా, పక్కా ప్లాన్ ప్రకారం కొందరు వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వ వాహనం బోర్డు ఉన్న కారులో అక్కడికి చేరుకున్న వారిని.. వాష్​రూంకు వెళ్తున్న నయీం చూసి పరిగెత్తాడు. దీంతో మరో వైపు నుంచి వచ్చిన ముగ్గురిలో ఒకరు ఫ్రై చేసేందుకు వాడే కడాయితో తలపై కొట్టగా తప్పించుకున్నాడు. వెంటనే మరొకరు అక్కడే ఉన్న కారం తీసుకుని కండ్లల్లో కొట్టాడు. మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేయగా, కడాయితో తలపై కొట్టాడు. కిందపడడంతో మరొకరు వేట కొడవలితో మెడపై నరికాడు. నయీం కొంచెం ముందుకు వచ్చి కిందపడిపోగా, కడాయితో ఒకరు.. కత్తితో మరొకరు.. తల్వార్‌‌తో మరొకరు నరికి చంపేశారు. తర్వాత నిందితులు వచ్చిన కారులోనే పారిపోయారు. పోలీసులు సీసీటీవీ పుటేజీ పరిశీలించారు. నయీంతో ఉన్న వ్యక్తులే హంతకులకు సమాచారం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. హత్య సమయంలో నయీం వెంట ఉన్న రవి, వెంకటేశ్, సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

చిన్నప్పటి ఫ్రెండ్స్.. కలిసి రౌడీయిజం.. 

నయీం, మహేశ్ ఆరో తరగతి నుంచే ఫ్రెండ్స్.  తమను అందరూ గుర్తించాలంటే ఏదో ఒకటి చేయాలని రౌడీయిజాన్ని మార్గంగా ఎంచుకున్నారు. సెటిల్‌మెంట్లు, దందాలతో పాటు గంజాయి రవాణాలోనూ ఆరి తేరారు. 15 ఏండ్ల కిందటే చిన్న చిన్న అల్లర్లలో పాల్గొన్నారు. అదే టైంలో మాజీ మావోయిస్టు నర్సింహాతో పరిచయాలు ఏర్పడ్డాయి. అయితే, నర్సింహాను ఇల్లెందులో కొందరు నడిరోడ్డుపై హత్య చేశారు. నర్సింహా స్థానాన్ని భర్తీ చేస్తామంటూ మహేశ్, నయీం చెప్తూ ఉండేవారు. ఇందులో భాగంగా చిన్నపాటి గ్యాంగ్‌లను ఏర్పాటు చేసి వాటికి లీడర్లుగా మారారు. నర్సింహా హత్య కేసులో ప్రధాన నిందితులైన భార్గవ్, రామును కత్తులతో పొడిచి చంపేందుకు రెండు సార్లు స్కెచ్ వేసి ఫెయిల్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఓసారి ఆయుధాలతో పోలీసుల చిక్కారు. మరోసారి రామును కారుతో ఢీకొట్టి చంపేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటనల్లో ఇద్దరి పేర్లు బాగా వినిపించడంతో.. అదే సాకుతో బెదిరింపులకు దిగుతూ పెద్ద పెద్ద సెటిల్‌మెంట్లు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్​సీనియర్​లీడర్లతో తిరగడం మొదలుపెట్టారు. ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మంలో సెటిల్‌మెంట్లు చేస్తూ ఎదిగారు. సదరు ఎమ్మెల్యే ఓడిపోవడం, ప్రభుత్వం కూడా రాకపోవడంతో ఖమ్మంలో యాక్టివిటీ తగ్గించి దందాను హైదరాబాద్‌కు మార్చారు. గ్రేటర్‌‌కు చెందిన ఓ బీఆర్ఎస్​ప్రజా ప్రతినిధికి కుడి భుజంగా మారారు. ఈ క్రమంలో నయీం హైదరాబాద్‌లోని నాగోలు బండ్లగూడ రాజీవ్ స్వగృహలో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. శివారులో సెటిల్మెంట్లు కూడా చేసేవాడు. దీంతో ఉప్పల్‌తో పాటు మరికొన్ని పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. మహేశ్​మాత్రం ఎక్కువగా ఖమ్మంలోనే ఉంటూ హైదరాబాద్‌కు
 వచ్చిపోతూ దందాలు చేసేవాడు.  

స్కెచ్‌కు.. రివర్స్ స్కెచ్..? 

మహేశ్ ఐదారు నెలల కింద నయీంకు చెప్పకుండా ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందు ప్రాంతాల్లో రూఫ్​టాప్ సోలార్ ​సబ్ డీలర్షిప్‌ తీసుకున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. తాను హైదరాబాద్‌లో ఉంటే  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకు తెలియకుండానే గ్యాంగ్‌లు ఏర్పాటు చేసి సెటిల్మెంట్లు చేస్తున్నాడంటూ మహేశ్‌పై నయీం కోపం పెంచుకున్నాడు. దీనిపై నయీం నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సెటిల్మెంట్ డబ్బుల విషయంలోనూ విబేధాలు వచ్చాయి. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన రౌడీ షీటర్​ఖలీల్‌తో కలిసి నయీం తనను చంపేందుకు స్కెచ్​వేస్తున్నాడని మహేశ్‌కు సమాచారం అందింది. దీంతో నయీంపై రివర్స్ స్కెచ్ వేసి, చంపించినట్టుగా అనుమానిస్తున్నారు.