ఇజ్రాయెల్‌తో ట్రంప్ భారీ ఆయుధ డీల్: రూ.26 వేల కోట్లు విలువైన 40వేల బాంబుల సరఫరా!

ఇజ్రాయెల్‌తో ట్రంప్ భారీ ఆయుధ డీల్: రూ.26 వేల కోట్లు విలువైన 40వేల బాంబుల సరఫరా!

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు ఏకంగా రూ.26వేల కోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసేందుకు ట్రంప్ డీల్ కుదుర్చుకున్నారు. ఈ భారీ ఆయుధ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌కు సుమారు 40వేల శక్తివంతమైన భారీ బాంబులను అందజేయనున్నారు. ఇందులో ప్రతి బాంబు బరువు దాదాపు 900 కిలోలు ఉండటం గమనార్హం.

బైడెన్ ఆంక్షలు ఎత్తివేత.. 
2024లో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. గాజా వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ భారీ బాంబులను ఉపయోగిస్తే ప్రాణనష్టం భారీగా జరుగుతుందనే భయంతో ఈ 900 కేజీల బాంబుల రవాణాను నిలిపివేశారు. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పీఠం ఎక్కిన తర్వాత ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేశారు. బైడెన్ హయాంలో నిలిచిపోయిన ఆయుధాల సరఫరాను పునరుద్ధరిస్తూ.. ట్రంప్ సర్కార్ కొత్త భారీ ఆయుధ ఒప్పందానికి రూపకల్పన చేసింది. ఈ డీల్‌లో భాగంగా 20వేల Mk84 బాంబులు, మరో 20వేల BLU-117 రకం బాంబులను ఇజ్రాయెల్‌కు పంపనుంది అమెరికా.

భూగర్భ బంకర్లను ఛేదించే సత్తా..
ఈ 900 కేజీల బరువున్న బాంబులు అత్యంత విధ్వంసకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ఇవి వివిధ మోడళ్లలో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా హమాస్ వంటి ఉగ్రవాద సంస్థల రహస్య భూగర్భ టెన్నెల్స్, బంకర్లను లక్ష్యంగా చేసుకుని నాశనం చేయడానికి కొన్ని బాంబులను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. మరికొన్ని భూమిపైనే పేలి భారీగా విధ్వంసాన్ని సృష్టిస్తాయి. గతంలో గాజాలో జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు, అక్కడ దొరికిన బాంబు అవశేషాలను పరిశీలిస్తే అమెరికాలో తయారైన బాంబులే ఎక్కువగా ఉపయోగించినట్లు తేలింది.

ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో సైనిక సాయం అందుతూనే ఉంది. గత ఏడాది ట్రంప్ యంత్రాగం సుమారు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధ విక్రయాలకు ఆమోదం తెలిపింది. ఇందులో 35,500 కంటే ఎక్కువ భారీ బాంబులు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో మరో 6.67 బిలియన్ డాలర్ల ఆయుధ అమ్మకాలను కూడా ఆమోదించారు. తాజాగా మరో రూ.26 వేల కోట్ల డీల్‌తో కలుపుకుంటే ఇజ్రాయెల్ సైనిక బలగాలకు అమెరికా అందిస్తున్న సపోర్ట్ మరింత బలోపేతం కానుంది.

గాజాలో ఉద్రిక్తతలు..
అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన మెరుపు దాడిలో దాదాపు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, 251 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. దీనికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ గాజాపై సమరానికి దిగింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిరినప్పటికీ.. అక్కడ హింస పూర్తిగా శాంతించలేదు. హమాస్ దాడులు, కాల్పుల విరమణ ఉల్లంఘనలకే తాము ప్రతిచర్యలు ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకూ దాదాపు 73వేల 264 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు బయటపెట్టాయి. చూడాలి అమెరికా ఇజ్రాయెల్ వెపన్స్ డీల్ ఇంకెంత విధ్వసాన్ని సృష్టిస్తుందో రానున్న రోజుల్లో.