- సరఫరాను పూర్తిగా నిలిపివేసిన సౌదీ ప్రభుత్వం
రియాద్: సౌదీ అరేబియాలోని కీలక ఈస్ట్-వెస్ట్ చమురు పైప్‌లైన్‌పై జరిగిన డ్రోన్ దాడుల ప్రభావం తీవ్రంగానే ఉంది. ఈ పైప్‌లైన్ రిపేర్లకు మూడు నుంచి ఐదు వారాలు పట్టే అవకాశం ఉందని సౌదీ ప్రకటించింది. గత గురువారం ఇరాన్ బార్డర్నుంచి డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం. అంతకు ముందే సౌదీ ప్రభుత్వం పైప్‌లైన్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అయితే డ్రోన్ దాడుల తర్వాత శాటిలైట్చిత్రాల్లో పైప్‌లైన్‌తో పాటు ఓ కీలక పంపింగ్ స్టేషన్ వద్ద కూడా నష్టం జరిగినట్లు కనిపించింది.
రోజుకు 40 లక్షల బ్యారెళ్ల చమురు
సుమారు 750 మైళ్ల పొడవైన ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ప్రస్తుతం సౌదీ అరేబియాకు అత్యంత కీలకమైన ఆయిల్ రవాణా మార్గం. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడంతో గల్ఫ్ ప్రాంతంలోని ఆయిల్‌ను ఎర్ర సముద్రంలోని యాన్‌బూ పోర్టుకు తరలించేందుకు ఈ పైప్‌లైన్‌ను సౌదీ విస్తృతంగా వాడుతున్నది. ఈ పైప్‌లైన్ ద్వారా రోజుకు సుమారు 40 లక్షల బ్యారెళ్ల ముడి చమురు తరలిస్తున్నట్లు సమాచారం. పైప్‌లైన్ పాక్షికంగా పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ ఎంత పరిమాణంలో ఆయిల్‌ను రవాణా చేయగలదనే దానిపై స్పష్టత లేదు.
ఆసియా రిఫైనరీల్లో ఆందోళన
పైప్‌లైన్ కు జరిగిన నష్టం తీవ్రతపై సౌదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయ లేదు. దీంతో యాన్‌బూ పోర్టు నుంచి తమకు రావాల్సిన చమురు లోడింగ్‌లపై ఆసియా రిఫైనరీలు ఆందోళన చెందుతున్నాయి. ఆసియా రిఫైనరీలకు సౌదీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని వ్యాపార వర్గాలు తెలిపాయి. పైప్‌లైన్ మరమ్మతులు ఆలస్యమైతే మిడిల్ఈస్ట్నుంచి ఆసియాకు ఆయిల్ సరఫరాలపై ప్రభావం పడే అవకాశం ఉండడంతో అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నది.
