- గణేశుడి ప్రతిష్ఠపై వివాదం..
- పూజలు లేకుండానే నిమజ్జనం
షాద్‌నగర్, వెలుగు: నవరాత్రులు పూజలు అందుకోవాల్సిన గణనాథుడు ఇరువర్గాల గొడవతో ఎలాంటి పూజలు అందుకోకుండానే గంగమ్మ ఒడికి చేరాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని జిల్లేడు చౌదరిగూడ మండలం పీర్జాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రోత్సవాలు నిర్వహించాలని కొందరు గ్రామస్తులు భావించారు.
అయితే హనుమాన్ దేవాలయంలో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందున ఆలయం వెలుపల వేరే చోట మండపం ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ ఎర్రగుమ్ము నర్సింలుతో పాటు మరికొందరు సూచించారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో చౌదరిగూడ పోలీసులు రంగప్రవేశం చేశారు.
ఆంజనేయస్వామి దేవాలయంలో ఎవరూ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని, వేరే చోట మండపం ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల నిర్ణయంతో ఓ వర్గం నిరాశకు గురైంది. అనంతరం వారు గణేశుడిని సోమవారం పండుగ రోజునే గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.
