వీపనగండ్ల, వెలుగు: వనపర్తి జిల్లా వీపనగండ్లలోని భీమా కాలువలో నాలుగేండ్లుగా పూడికతీత, జమ్మును తొలగించకపోవడంతో పొలాలకు సాగు నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కాలువలో పేరుకుపోయిన బురద, మట్టి, జమ్మును తొలగించేందుకు గ్రామానికి చెందిన 40 మంది రైతులు స్వచ్ఛందంగా ముందు కొచ్చారు. తమ సొంత ఖర్చులతో పూడికతీత పనులు చేపట్టారు.
రైతులు డబ్బులు సమకూర్చుకొని యంత్రాల సాయంతో భీమా కాలువలో పేరుకుపోయిన పూడిక తొలగిస్తున్నారు. నాలుగేండ్లుగా అధికారులు భీమా కాలువ వైపు కన్నెత్తి చూడడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక చొరవ తీసుకొని శ్రీరంగాపూర్ రిజర్వాయర్ నుంచి భీమా కాలువకు సాగు నీటిని విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతులు జొల్లు పెద్దబాబు, పెద్ద వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కురువ రాంచందర్, కురువ రాముడు, లోకా రెడ్డి పాల్గొన్నారు.
