టేకులపల్లి, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో కాపర్ వైర్ల చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పీఎస్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు వివరాలు వెల్లడించారు. సమ్మక్క-సారక్క గద్దెల వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి ఆటోలో పారిపోయేందుకు యత్నించిన ముగ్గురిని పట్టుకుని విచారించగా చోరీల విషయం వెలుగులోకి వచ్చింది.
చుంచుపల్లి మండలం పెనగడపకు చెందిన పల్లపు వెంకటేశ్, మణుగూరుకు చెందిన రౌతు రమేశ్, కొత్తగూడెం రామవరానికి చెందిన వేముల సంతోష్ కలిసి టేకులపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. చోరీ చేసిన 178.5 కిలోల కాపర్ వైర్లను పాల్వంచలోని స్క్రాప్ దుకాణంలో రూ.3.57 లక్షలకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. వారి నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకున్న సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై కేతిరుపతి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
