రైస్ మిల్లర్ల అక్రమాలకు చెక్: తనిఖీలకు ముందు ఆఫీసర్ల ర్యాండమైజేషన్.. సివిల్ సప్లై కొత్త ఎత్తుగడ

రైస్ మిల్లర్ల  అక్రమాలకు చెక్: తనిఖీలకు ముందు ఆఫీసర్ల ర్యాండమైజేషన్.. సివిల్ సప్లై కొత్త ఎత్తుగడ
  • రైస్ మిల్లుల్లో సోదాలకు ‘ఓపీఎంఎస్’తో టీముల ఎంపిక
  • ఏ మిల్లుకు ఎవరు వెళ్లాలో క్షణాల ముందే డిసైడ్
  • ఆఫీసర్లతో అక్రమార్కులు కుమ్మక్కు కాకుండా చర్యలు

ఖమ్మం, వెలుగు: మిల్లర్ల నుంచి కస్టమ్‌‌ మిల్లింగ్‌‌ రైస్‌‌(సీఎంఆర్‌‌)ను తిరిగి రప్పించేందుకు అధికారులు ఎత్తుకు పైఎత్తులు వేయాల్సి వస్తోంది. సివిల్‌‌ సప్లై శాఖలో కొందరు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లకు చెక్‌‌ పెట్టేలా తనిఖీ సిబ్బందిని ర్యాండమైజేషన్‌‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఆయా మిల్లుల్లో ధాన్యం నిల్వలను తనిఖీ చేసేందుకు వెళ్లే టీమ్‌‌లను సోదాలకు కొన్ని గంటల ముందు మాత్రమే ఎంపిక చేసేలా టెక్నాలజీని వినియోగించనున్నారు. 

ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ఆన్‌‌లైన్‌‌ ప్రొక్యూర్‌‌మెంట్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సిస్టమ్‌‌(ఓపీఎంఎస్‌‌) సాఫ్ట్‌‌వేర్‌‌ను ఉపయోగిస్తోంది. దీనికి తాజాగా కొన్ని మాడ్యూల్స్‌‌ను జోడించి, యాప్‌‌ రూపంలో సివిల్‌‌ సప్లై, రెవెన్యూ అధికారులకు అందుబాటులోకి తెచ్చారు. చెకింగ్‌‌ టీమ్‌‌లలో ఉండే సిబ్బంది వివరాలను ముందుగా ఆన్‌‌లైన్‌‌ యాప్‌‌లో నమోదు చేసి, ర్యాండమైజేషన్‌‌ ద్వారా ఏ టీమ్‌‌లో ఎవరుండాలనేది నిర్ణయిస్తారు.

 ఆ తర్వాత తనిఖీలకు వెళ్లడానికి కొన్ని క్షణాల ముందు మాత్రమే ఏ టీమ్‌‌ ఏ మిల్లులో సోదాలు నిర్వహించాలనేది ఖరారు చేస్తారు. దీని ద్వారా అధికారులు, సిబ్బందితో మిల్లర్లు ముందస్తుగా కుమ్మక్కయ్యే చాన్స్​ ఉండబోదని సివిల్‌‌ సప్లయ్స్‌‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సోదాల్లో పారదర్శకత పెరుగుతుందని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.

స్పాట్​లో ఆన్‌‌లైన్‌‌లో నమోదు..

ర్యాండమైజేషన్‌‌ ద్వారా ఎంపిక చేసిన టీమ్‌‌లు ఆయా మిల్లులకు వెళ్లిన తర్వాత టీమ్‌‌ను లీడ్‌‌ చేస్తున్న అధికారి తన లాగిన్‌‌ వివరాలతో ఓపీఎంఎస్‌‌ యాప్‌‌లో లాగిన్‌‌ అవుతారు. యాప్‌‌లో అప్పటికే ఆ మిల్లుకు ఎంత ధాన్యం కేటాయించారు, ఇప్పటి వరకు ఎంత బియ్యం తిరిగి ఇచ్చారు, ఇంకా ఎంత ధాన్యం నిల్వ ఉండాలనే వివరాలు ఉంటాయి. వాటిని క్రాస్‌‌చెక్‌‌ చేసుకుంటూ అక్కడ నిల్వ ఉన్న ధాన్యం వివరాలను యాప్‌‌లో తిరిగి నమోదు చేయాల్సి ఉంటుంది. 

సోదాలకు వెళ్లిన సమయంలో అక్కడ నిల్వ ఉన్న ధాన్యం నుంచి ఐదు ప్రాంతాల్లో నమూనాలను సేకరిస్తారు. జీపీఎస్‌‌ కోఆర్డినేట్లతో కూడిన రియల్‌‌టైమ్‌‌ ఫొటోలను తీసి యాప్‌‌లో అప్‌‌లోడ్‌‌ చేస్తారు. ఉండాల్సిన స్టాక్‌‌ పరిమాణంలో తేడా ఉంటే అందుకు తగిన కారణాలను తేల్చి, మిల్లర్‌‌ స్టేట్‌‌మెంట్‌‌ను రికార్డు చేసి అప్‌‌లోడ్‌‌ చేస్తారు. స్పాట్‌‌ నుంచే మిల్లుకు సంబంధించిన నివేదికను సమర్పిస్తుండడంతో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. 

ఖమ్మం జిల్లాలో మొత్తం 81 మిల్లులు ఉండగా.. వాటిలో 75 రా రైస్‌‌ మిల్లులు, ఆరు బాయిల్డ్‌‌ రైస్‌‌ మిల్లులు ఉన్నాయి. ఇప్పటి వరకు 15 మిల్లుల్లో విజిలెన్స్‌‌ టీమ్‌‌లు తనిఖీలు చేయగా.. దాదాపు రూ.65 కోట్ల విలువైన 21,442 మెట్రిక్‌‌ టన్నుల ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. అధికారుల హెచ్చరికలతో ఇప్పటి వరకు కొంతమంది మిల్లర్లు రూ.44.54 కోట్ల వరకు డబ్బు చెల్లించారు.

గత అక్రమాలకు చెక్‌‌ పెట్టేలా..

ప్రతి వారం తనిఖీలు చేసే టీమ్‌‌లలో మార్పులు చేయడం ద్వారా అధికారులు, చెకింగ్‌‌ టీమ్‌‌లకు మధ్య ముందస్తు సంప్రదింపులు జరగకుండా, అక్రమాలకు పాల్పడే అవకాశం లేకుండా చేయవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విజిలెన్స్‌‌ టీమ్‌‌లలో ఉన్న సిబ్బంది ఆయా మిల్లర్లతో కుమ్మక్కై రూ.కోటికి పైగా డబ్బులు తీసుకొని తప్పుడు నివేదికలు సమర్పించినట్లు గుర్తించి, వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అలాంటి ఘటనలకు మళ్లీ అవకాశం లేకుండా తనిఖీల విధానంలో కొత్తగా ఈ మార్పులు చేశారు.

తనిఖీలకు క్షణాల ముందే క్లారిటీ..

ప్రతి ఏటా సీఎంఆర్‌‌ పెండింగ్‌‌ ఉంటుండడంతో ఆయా రైస్‌‌ మిల్లుల్లో రెగ్యులర్‌‌ తనిఖీలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి బుధవారం మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం ఆన్‌‌లైన్‌‌ ర్యాండమైజేషన్‌‌లో అధికారులు, సిబ్బందిని టీమ్‌‌లుగా ఏర్పాటు చేస్తారు. 

ఆయా టీమ్‌‌లకు బుధవారం సోదాలకు వెళ్లడానికి కొన్ని క్షణాల ముందు మిల్లులను కేటాయిస్తారు. మిల్లుల్లో తనిఖీలకు టీమ్‌‌లు వెళ్లిన తర్వాత ఓపీఎంఎస్‌‌ యాప్‌‌లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్‌‌లలో పౌరసరఫరాల శాఖ అధికారులు, సివిల్‌‌ సప్లై జిల్లా మేనేజర్లు, సివిల్‌‌ సప్లై డీటీలు, రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌‌స్పెక్టర్లు ఉంటారు. 

ఇప్పటికే వీరందరి వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. వేర్వేరు హోదాల్లో ఉన్న సిబ్బందిని ర్యాండమైజేషన్‌‌ ద్వారా టీమ్‌‌లుగా ఏర్పాటు చేసిన తర్వాత, ఆయా సిబ్బంది మొబైల్‌‌ ఫోన్లకు మెసేజ్‌‌ వెళ్తుంది. బుధవారం చివరి క్షణంలో ఏ మిల్లులకు ఏ టీమ్‌‌ వెళ్లాలనే డ్యూటీలను కేటాయిస్తారు. సెలవు ఉంటే తర్వాత రోజు తనిఖీలు చేస్తారు.

ఏకకాలంలో మెరుపుదాడులు

యాదాద్రి, వెలుగు: డిఫాల్ట్​ మిల్లులపై సివిల్​ సప్లయ్​ శాఖ మెరుపు దాడులకు సిద్ధమైంది. బుధవారం ఏకకాలంలో అన్ని మిల్లులపై దాడులు నిర్వహించి.. వడ్ల స్టాక్​ లెక్కించనుంది. ఇందుకోసం ఒక్కో మిల్లుకు ఒక్కో ఆఫీసర్​ను కేటాయించింది. స్టాక్​ తక్కువగా ఉంటే పంచనామ నిర్వహించి.. వెంటనే కేసులు నమోదు చేయనుంది. ఆ తర్వాత వెనువెంటనే అడిషనల్​ కలెక్టర్లు, ఆర్డీవోలు సూపర్​ చెక్​ చేయనున్నారు.

 ఒక్కో మిల్లుకు ఒక్కో ఆఫీసర్​ను ఏర్పాటు చేయగా, సదరు ఆఫీసర్​ వెళ్లాల్సిన మిల్లును చివరి వరకూ సస్పెన్స్​లోనే ఉంచుతున్నారు. కేటాయించిన మిల్లు వద్దకు ఆఫీసర్​ వెళ్లగానే ఫిజికల్​ వెరిఫికేషన్(పీవీ) యాప్​ ఓపెన్​ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. యాదాద్రి జిల్లాలోని 51 మిల్లులోని 5 లక్షల టన్నుల వడ్ల స్టాక్​ను 51 మంది ఆఫీసర్లు బుధవారం లెక్కించనున్నారు. 

స్టాక్​ లో తేడాలు వస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. మిల్లుల్లో జిల్లా, మండల ఆఫీసర్లు తనిఖీలు చేశాక అడిషనల్​ కలెక్టర్లు, ఆర్డీవోలు వేర్వేరుగా తనిఖీలు నిర్వహించనున్నారు. ఫైనల్​గా మరోసారి ఎన్​ఫోర్స్​మెంట్​ టీమ్​తో మిల్లుల్లో ర్యాండమ్​గా తనిఖీలు నిర్వహిస్తారు.