ఎగుమతులు 26 శాతం జంప్..ఐదు నెలల కనిష్టానికి వాణిజ్య లోటు

ఎగుమతులు 26 శాతం జంప్..ఐదు నెలల కనిష్టానికి వాణిజ్య లోటు
  • గత నెల వీటి విలువ రూ.4.20 లక్షల కోట్లు
  • 14 శాతం పెరిగిన దిగుమతులు
  • ఐదు నెలల కనిష్టానికి వాణిజ్య లోటు

న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు పెరగడంతో మనదేశ సరుకుల ఎగుమతుల విలువ గత నెల 26.12 శాతం పెరిగి రూ.4.20 లక్షల కోట్లకు చేరుకుంది. బంగారం దిగుమతులు తగ్గడం వల్ల వాణిజ్య లోటు 5 నెలల కనిష్ట స్థాయి అయిన రూ.2.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఆగస్టులో దిగుమతుల విలువ 14.1 శాతం పెరిగి రూ.6.79 లక్షల కోట్లుగా నమోదయింది. 

ఈ కాలంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్​ ధర 94 డాలర్లు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఎగుమతులు 17.85 శాతం ఎగబాకి రూ.20,72,736 కోట్లకు చేరాయి.  దిగుమతుల విలువ 18.21 శాతం పెరిగి రూ.34,84,800 కోట్లుగా నమోదయింది. తొలి ఐదు నెలల్లో వాణిజ్య లోటు రూ.14,12,064 కోట్లకు విస్తరించింది. గత ఏడాది ఆగస్టులో ఈ లోటు రూ.2.61 లక్షల కోట్లు ఉండేది. గత ఏడాది ఆగస్టులోరూ.51,801 కోట్లు బంగారం దిగుమతుల విలువ ఈసారి రూ.22,080 కోట్లకు పడిపోయింది.