వెలుగు స్పెషల్ : మనుస్మృతి మనలో జీర్ణించుకు పోయిందా?

వెలుగు స్పెషల్ : మనుస్మృతి మనలో జీర్ణించుకు పోయిందా?

ఇటీవల ఒక దళిత శాసనసభ్యుడిపై అవమానకర వ్యాఖ్య జరిగిందనే నిరసనలో వెయ్యి డప్పులతో చావు డప్పు కొడతామని దళిత నాయకులే ముందుకు రావడం జరిగింది. ఒక దళిత నాయకుడిని అవమానించినందుకు నిరసన తెలపడం సమర్థనీయం. కానీ ఆ నిరసనకు డప్పు కొట్టేవారు తప్పనిసరిగా దళితులే కావాలా? ఒక అగ్రవర్ణ నాయకుడు డప్పు కొట్టకూడదా? ఒక బీసీ నాయకుడు కొట్టకూడదా? ఒక బ్రాహ్మణుడు కొట్టకూడదా? ఒక మహిళ కొట్టకూడదా? కుల వివక్షను వ్యతిరేకిస్తున్న ఉద్యమమే మళ్లీ కులాన్ని వృత్తి గుర్తింపుగా ఎందుకు ఉపయోగించాలి? ఇదే మన ఆత్మావలోకనానికి అసలు బిందువు.

వేదాలను కులవ్యవస్థకు ఏకైక మూలంగా చూపడం చారిత్రకంగా సరళీకరణ. ఋగ్వేదంలోని పురుషసూక్తం (10.90.12) సమాజంలోని నాలుగు వర్ణాలను పురుషుని నోరు, భుజాలు, తొడలు, పాదాలతో ప్రతీకాత్మకంగా అనుసంధానిస్తుంది. అయితే ఆ మంత్రం ఆధునిక అర్థంలో జన్మ ఆధారిత జాతి వ్యవస్థ మొత్తాన్ని నిర్దేశిస్తుందని చెప్పడం అతిసరళీకరణ. గీతలో కూడా ‘చాతుర్వర్ణ్యం మయా సృష్టం  గుణకర్మవిభాగశః’ అని వర్ణాన్ని గుణం–కర్మ విభజనతో వివరిస్తుంది. కానీ తరువాతి ధర్మశాస్త్ర సాహిత్యంలో,  ముఖ్యంగా మనుస్మృతిలో, జన్మ, వర్ణం, వృత్తి, సామాజిక హక్కుల మధ్య మరింత కఠినమైన సంబంధాలను ప్రతిపాదించిన శ్లోకాలు కనిపిస్తాయి.

 ఉదాహరణకు మనుస్మృతి పదో అధ్యాయంలో శూద్రుని ప్రధాన జీవనోపాధిగా ఇతర వర్ణాలకు సేవను నిర్దేశించడం, సంపద కూడబెట్టడంపై కూడా పరిమితి విధించడం కనిపిస్తుంది.  అందువల్ల సమస్యను ‘వేదం అంతా చెడ్డది’ అని తేల్చడం కాదు, అలాగే ‘మనుస్మృతి చెప్పింది కాబట్టి అదే శాశ్వత ధర్మం’ అని సమర్థించడం కూడా కాదు. ప్రశ్న ఒక్కటే..మానవ గౌరవానికి విరుద్ధంగా ఉన్న ఏ సంప్రదాయమైనా, అది ఎంత పురాతనమైనదైనా, ఆధునిక రాజ్యాంగ సమాజంలో కొనసాగాలా? సమాధానం స్పష్టంగా లేదు.

సాంప్రదాయీకరించిన అసమానత

కుమ్మరి కుండలు చేయడం ఒక గొప్ప నైపుణ్యం. చాకలి బట్టలు ఉతకడం ఒక వృత్తి. మంగలి క్షౌరం చేయడం ఒక నైపుణ్యం. మత్స్యకారుడి చేపల వేట ఒక జీవన నైపుణ్యం. పద్మశాలి చేనేత ఒక అద్భుతమైన సాంకేతిక–సాంస్కృతిక వారసత్వం. కానీ ఈ నైపుణ్యాలను జన్మతో కట్టిపడేయడం మాత్రం సమస్య. ఈ రోజున బ్యూటీ పార్లర్లు ఎవరు నిర్వహిస్తున్నారు? డ్రై క్లీనింగ్ దుకాణాలు ఎవరు నడుపుతున్నారు? బంగారు ఆభరణాల వ్యాపారం ఎవరు చేస్తున్నారు? హోటళ్లు, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? వృత్తి జన్మకు బానిసగా లేకపోతే, సాంప్రదాయ కులవృత్తుల విషయంలో మాత్రం ఆ బంధాన్ని ఎందుకు కాపాడాలి? ఇక్కడే కులవ్యవస్థ తన అత్యంత తెలివైన రూపంలో బతుకుతోంది. 

కులాన్ని తిట్టకుండా, కులపాత్రలను పవిత్రం చేయడం ద్వారా.‘ఇది మీ సంప్రదాయం’, ‘ఇది మీ గొప్ప సంస్కృతి’, ‘మీ వృత్తి మీ గౌరవం’ అని చెప్పడం వినడానికి మధురంగా ఉంటుంది. కానీ ఆ వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ లేకపోతే? ఇతర వృత్తుల్లోకి వెళ్లే అవకాశం లేకపోతే? విద్య అందకపోతే? ఆర్థిక స్వాతంత్ర్యం రాకపోతే? అప్పుడు అది గౌరవం కాదు, సాంప్రదాయీకరించిన అసమానత.

అంబేద్కర్​ రాజీనామాకు దారితీసిన సంఘటన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు సమస్య కేవలం కులపేరు కాదు. కులం మనిషి సామాజిక అవకాశాలను ముందే నిర్ణయించే వ్యవస్థ. హిందూ కోడ్ బిల్లును ముందుకు తీసుకెళ్లడంలో తీవ్ర ప్రతిఘటన ఎదురై, అది ముందుకు సాగకపోవడంతో అంబేద్కర్ 1951లో కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. నెహ్రూ స్వయంగా హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందకపోవడం అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీవ్ర నిరాశ కలిగించిందని రాశారు.  అంబేద్కర్ మనకు ఇచ్చిన అసలు పాఠం కులాన్ని రాజకీయ గుర్తింపుగా శాశ్వతం చేయడం కాదు, కులం నిర్ణయించే జీవితాన్ని ధ్వంసం చేయడం. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన నాయకులూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ శాఖలకు మంత్రులుగా ఉండటం సరిపోతుందా? తమ వర్గాల పిల్లలకు నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయా? ఉపాధ్యాయులు ఉన్నారా? ఉన్నత విద్యకు మార్గం ఉందా? వృత్తి స్వేచ్ఛ ఉందా? ఆర్థిక స్వాతంత్ర్యం ఉందా?

రిజర్వేషన్​ ముక్తికాదు

రిజర్వేషన్ ఒక్కటే విముక్తి కాదు. విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం, ఆస్తి, నైపుణ్యం, ఉద్యోగం, ఆత్మగౌరవం.. ఇవే అసలు సామాజిక విముక్తి. ఇక్కడ కార్ల్ మార్క్స్ చెప్పిన వర్గ - ఆర్థిక విశ్లేషణ, తరువాత అడోర్నో- హోర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హైమర్ అభివృద్ధి చేసిన “కల్చర్ ఇండస్ట్రీ” భావన కూడా ఉపయోగపడతాయి. సంస్కృతి కూడా అధికార సంబంధాలను పునరుత్పత్తి చేసే సాధనంగా మారవచ్చన్న ఆలోచనను మన కుల రాజకీయాలకు అన్వయించి చూడవచ్చు. పాత అసమానతకు కొత్త సాంస్కృతిక ప్యాకేజింగ్ ఇచ్చినంత మాత్రాన అది సమానత్వం కాదు. మనుస్మృతిని తగులబెట్టడం మాత్రమే పరిష్కారం కాదు. దానిని ఆరాధించడం కూడా పరిష్కారం కాదు.

కుల రహిత సమాజం వైపు వెళ్లాలంటే..

మనలో మనమే మనుస్మృతిగా మారిన చోటే అసలు పోరాటం ప్రారంభం కావాలి. డప్పు కొట్టే వాడు ఎవరో కాదు డప్పు కొట్టాలనుకునే వాడెవడైనా కొట్టాలి. పాడె కట్టే వాడు కులంతో నిర్ణయించబడకూడదు. కుండ చేసేవాడు కుమ్మరే కావాల్సిన అవసరం లేదు. బట్టలు ఉతికేవాడు చాకలే కావాల్సిన అవసరం లేదు. జుట్టు కత్తిరించేవాడు మంగలే కావాల్సిన అవసరం లేదు. చేపలు పట్టేవాడు ఒకే కులానికి చెందాల్సిన అవసరం లేదు. చేనేత చేసేవాడు పద్మశాలే కావాల్సిన అవసరం లేదు.  

వృత్తి స్వేచ్ఛే నిజమైన గౌరవం. విద్యే నిజమైన సాధికారత. ఆర్థిక స్వాతంత్ర్యమే నిజమైన విముక్తి. అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్న భారతదేశం, ఇంకా మనిషిని అతని జన్మించిన కులం ఆధారంగా ఒక పనికి కట్టిపడేస్తే.. అది సాంకేతికంగా 21వ శతాబ్దం కావచ్చు. కానీ సామాజికంగా మాత్రం మనం ఇంకా గత శతాబ్దాల నీడలో ఉన్నట్టే. అందుకే నేటి యువత ప్రశ్నించాల్సింది ‘నా కులం ఏమిటి?’ కాదు. ‘నా జీవితాన్ని నా కులం ఎందుకు నిర్ణయించాలి?’ అదే ప్రశ్న కులవృత్తి నుంచి కులరహిత సమాజం వైపు తీసుకెళ్లే నిజమైన తొలి అడుగు.

సిహెచ్. వి. ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
[email protected]
రచన 700 పదాలకు మించరాదు.