హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐ.ఎస్. సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ వాటర్ ట్యాంక్ రోడ్‌లో ఉన్న ఓ రెండు అంతస్తుల భవనంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. భవనం మొదటి అంతస్తులో నిర్వహిస్తున్న ప్రైవేట్ కిడ్స్ స్కూల్‌లో ఈ మంటలు వ్యాపించినట్లు సమాచారం.
భవనం రెండో అంతస్తులో నివాస గృహం ఉండటంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను వెంటనే బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సమాచారం అందుకున్న ఐ.ఎస్. సదన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో పాటు డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో ఆస్తి నష్టం ఎంతమేర జరిగిందనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.మరోవైపు, సమాచారం అందుకున్న యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
