నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ చెల్లింపుల కోసం కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధి విధానాలను విడుదల చేసింది. రూ.2వేల కంటే ఎక్కువ విలువైన మర్చంట్ పేమెంట్ లావాదేవీలపై 0.4 శాతం మేర MDR వర్తించనుంది. ఈ కొత్త రూల్ అక్టోబర్ 15, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. వ్యాపారి నుంచి వసూలు చేసే ఫీజును యూపీఐ వ్యవస్థలోని వివిధ భాగస్వాములకు ఏ విధంగా పంచుతారనే దానిపై స్పష్టమైన విధివిధానాలను NPCI ప్రకటించింది. యూపీఐ లావాదేవీల ద్వారా వచ్చే MDR మొత్తాన్ని పార్ట్నర్ బ్యాంకులు, టెక్నాలజీ సంస్థల మధ్య ఎలా పంచుకుంటాయో తెలుసుకుందాం రండి..
1. ఇష్యూయర్ బ్యాంకులు (కస్టమర్ అకౌంట్ ఉన్నవి): మొత్తం MDR మొత్తంలో అత్యధికంగా 40 శాతం వాటాను కస్టమర్ ఖాతాను నిర్వహించే బ్యాంకు పొందుతుంది. ఉదాహరణకు రూ.10వేల లావాదేవీపై రూ.40 ఛార్జీ వసూలైతే ఇందులో రూ.16 ఈ బ్యాంకుకే వెళుతుంది.
2. మర్చంట్ అక్వైరర్లు (వ్యాపారి ఖాతా బ్యాంకు): వ్యాపారులకు పేమెంట్స్ స్వీకరించే సేవలను అందించే అక్వైరర్ బ్యాంకులకు 30 శాతం అంటే రూ.10వేల పేమెంట్ పై రూ.12 దక్కుతుంది.
3. యూపీఐ యాప్స్: ఫోన్‌పే, గూగుల్ పే వంటి యూపీఐ అప్లికేషన్లను నిర్వహించే సంస్థలకు 20 శాతం అంటే రూ.10వేల చెల్లింపుపై రూ.8 వాటా వస్తుంది.
4. బ్యాంక్ పార్టనర్స్: యూపీఐ యాప్‌లకు టెక్నికల్ అండ్ బ్యాంకింగ్ సేవలను అందించే పార్ట్నర్ బ్యాంకులకు మిగిలిన 10 శాతం అంటే రూ.10వేల పేమెంట్ పై రూ.4 వాటా అందుతుంది.
కస్టమర్లు, వ్యాపారులపై ప్రభావం?
సాధారణ వ్యక్తుల మధ్య జరిగే పీపుల్-టు-పీపుల్ యూపీఐ ట్రాన్సాక్షన్లు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితం. అలాగే రూ.2వేల లోపు ఉండే రోజువారీ చిన్నచిన్న లావాదేవీలపై ఎలాంటి MDR ఉండదు. అంతేకాకుండా వ్యాపారులు ఎవరూ కూడా ఈ MDR చార్జీలను కస్టమర్లపై రుద్దడానికి వీల్లేదని NPCI స్పష్టం చేసింది. యూపీఐ యాప్‌లు కూడా వినియోగదారుల నుంచి ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి లేదు.
2020 నుంచి ఎలాంటి మర్చంట్ ఫీజు లేకుండా నడుస్తున్న యూపీఐ వ్యవస్థను మెుత్తానికి ఛార్జీల కిందకు తీసుకొచ్చింది మోడీ సర్కార్. ఈ ఛార్జీలను వ్యాపారులు భరించటానికి ఇష్టపడరు కాబట్టి వారు యూపీఐ చెల్లింపుల స్వీకరణను తగ్గించే అవాకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇది మళ్లీ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ పేమెంట్స్ నుంచి ప్రజలు డబ్బు వాడకం దిశగా పురిగొల్పుతుందని హెచ్చరిస్తున్నారు.
